కేసీఆర్ భూములపై సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి
చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినబీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) భూములకు సంబంధించి అసెంబ్లీకి తప్పుడు సమాచారమిచ్చి సభను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టి పద్మారావు, గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వారు కలిసి సీఎం రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు. ఈనెల 16న అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూములుపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 330 ఎకరాల అసైన్డ్ భూములున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారని తెలిపారు. 330 ఎకరాల అసైన్డ్ భూమిని కేసీఆర్ ఆక్రమించారని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా మాట్లాడి సభానాయకుడు, సీఎం అనే విచక్షణను కోల్పోయారని తెలిపారు. 22ఏలో లక్షలాది ఎకరాలు చేర్చడంలో జరిగిన అక్రమాలను బీఆర్‌ఎస్ బయటపెట్టినందుకే కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యల్లో భాగంగానే దురుద్దేశంతో అవాస్తవాలను సభ ముందుంచారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తుల భూములను కూడా ఆయన ఖాతాలో వేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. పవిత్రమైన చట్టసభలో అవాస్తవాలతో సీఎం చేసిన ప్రకటన సభాహక్కుల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాస్తవ విరుద్ధమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు రేవంత్‌రెడ్డిపై అసెంబ్లీ నిర్వహణ నియమావళిలోని 168 నిబంధన కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇస్తున్నామని తెలిపారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



