Saturday, September 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేంద్రం ఆదుకోవాలి

కేంద్రం ఆదుకోవాలి

- Advertisement -

రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
ఎల్ నినోను అంచనా వేసేందుకు ప్రతినిధులను పంపండి .. వీబీ గ్రామ్‌ జీపై ఖర్చును కేంద్రమే భరించాలి
50 రోజులు అదనంగా పని కల్పించండి ..1,500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలి
రుణపరిమితి 3.5 శాతానికి పెంచాలి..కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి 

అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..శాసనసభ నిరవధిక వాయిదా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల ప్రభావం నుంచి గట్టెక్కేందుకు వీలుగా తక్షణమే తగినంత సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం ఎల్ నినో పరిస్థితులపై స్వల్పకాలిక చర్చ అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ‘‘ఎల్ నినో పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వీలైనంత త్వరగా రాష్ట్రానికి పంపించాలి. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి తగిన సాయం మంజూరు చేయాలి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిలో కేంద్ర వాటాను సత్వరమే విడుదల చేయాలి. పంట నష్టం/ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం, పశు సంపద పరిరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణతో పాటు ఉపశమన చర్యలకు తగిన సహాయం అందించాలి. అవసరమైతే అందుకు వీలుగా నిబంధనలను సడలించాలి. ‘వీబీ గ్రామ్‌ జీ’లో 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలి. ఈ చట్టంపై ఖర్చు పెట్టే వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 60 రోజుల సీజనల్ సస్పెన్షన్ కాలాన్ని సడలించాలి. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించేందుకు లేబర్ బడ్జెట్‌ను తగినంతగా పెంచాలి.

రాష్ట్రానికి అవసరమైన ఎరువులను తగినంతగా, సకాలంలో కేటాయించాలి. ప్రభావిత జిల్లాలకు ముందుగానే రేక్‌ల ద్వారా సరఫరా చేయాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్కింద కేటాయింపులను పెంచి డ్రిప్ ఇరిగేషన్‌ను వేగంగా విస్తరించాలి. మిషన్ ఫర్ ఇంటిగ్రేటేడ్ డెవెలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలి. తెలంగాణకు అదనంగా 1,500 మెగావాట్ల విద్యుత్తు కేటాయించాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో కేటాయించకుండా ఉన్న కోటా నుంచి దీన్ని అందించాలి. విండో–I కింద 5 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ నిర్ధారించి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రేక్‌ల లభ్యతను పెంచాలి. విద్యుత్తు ట్రాన్స్ మిషన్ చార్జీలను సడలించి, అవసరమైన సాయం అందించాలి. తాగు, సాగు నీటి అవసరాలు, కరువు నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీ మంజూరు చేయాలి. చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవ, పురోగతిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వివిధ కేంద్ర పథకాల కింద తగిన సహాయం అందించాలి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని జీఎస్‌డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలి. తద్వారా ఉపశమన, నివారణ చర్యలకు అవసరమైన అదనపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు అవకాశం కల్పించాలి.

రైతులు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అదనపు ఆర్థిక సాయం అందించాలి. అందుకు అవసరమైన తీరుగా నిబంధనలను సడలించాలి..’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. అంతకుముందు స్వల్పకాలిక చర్చకు మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తూ, ఎల్ నినో వల్ల రాష్ట్రంలో నెలకొనబోయే పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్ మాసంలోనే రైతులు, ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 20 శాతంగా ఉందనీ, దీంతో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. 88 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయనీ, వరి సాగు విస్తీర్ణం 18 శాతానికి తగ్గిందని, పలుమార్లు విత్తనాలు వేయాల్సి రావటంతో రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి భారం పెరిగిందని చెప్పారు. జలాశయాల సామర్థ్యం 585 టీఎంసీలు కాగా సెప్టెంబర్ 15 నాటికి 241 టీఎంసీల నిల్వ మాత్రమే ఉందని తెలిపారు. నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వ్ చేసుకోవాల్సి ఉందనీ, ఈ నీటి నిల్వలు యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు సరిపోవని స్పష్టం చేశారు. సాగునీరు, తాగునీటి సరఫరాకు భూగర్భ జలాలు, విద్యుత్తుపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోందని తెలిపారు.

ఇప్పుడున్న పరిస్థితిని ముందే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగుకు అవసరమైన విద్యుత్తు సరఫరాకు అవసరమైన ఉపశమన చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందించాల్సిన అవసరముందని చెప్పారు. అంతకుముందు స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. దీనికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హరీశ్ బాబు చెప్పినదానితో ఏకీభవిస్తున్నారా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినోపై చర్చించకుండా మహేశ్వర్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టును చేపట్టలేదని విమర్శించారు. అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదనే తెలంగాణ తెచ్చుకున్నామనీ, ఇప్పుడు మహారాష్ట్రలో, కేంద్రంలో ఉన్న బీజేపీని ఒప్పిస్తారా అని ప్రశ్నించారు. తాము ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -