- సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతుండగా, అధికార ప్రభుత్వం “కల్పిత ఉపాధి గణాంకాలను” ప్రదర్శిస్తోందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ విలువపై బీజేపీ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. దేశంలో తీవ్రమవుతున్న జీవనోపాధి సంక్షోభాన్ని ఆయన ఎత్తి చూపారు. “ఒకప్పుడు డాలర్ ఎటువైపు వెళుతోందని ప్రశ్నించిన వారు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎక్కడ నిలుస్తుందో గమనించాలి” అని కేంద్రాన్ని ఉద్దేశించి యాదవ్ అన్నారు. అదుపు తప్పిన ద్రవ్యోల్బణం సామాన్య కుటుంబాలను దెబ్బతీస్తున్న తరుణంలో, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోడీ సర్కార్ అంకెల గారడీ చేస్తోందని ఆయన మండిపడ్డారు.
మోడీ పాలనలో ద్రవ్యోల్బణం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. నిరుద్యోగ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ బీజేపీ ప్రభుత్వం నిజమైన పరిష్కారాలు చూపకపోగా, ఉద్యోగ కల్పన పేరిట తప్పుడు అంకెలను, అసత్య గణాంకాలను ప్రచారం చేస్తోందన్నారు. నిరంతర ధరల పెరుగుదల సామాన్యుడికి ఉపశమనం లభించడంలేదన్నారు.



