Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయంజార్ఖండ్‌‌లో పోలీసుల దాష్టీకం

జార్ఖండ్‌‌లో పోలీసుల దాష్టీకం

- Advertisement -

అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత..రాంచీలో విద్యార్థులపై లాఠీచార్జి
టియర్‌ ‌గ్యాస్‌, వాటర్‌ కెనాన్ల ప్రయోగం
పరీక్షల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
రాంచీ :
ఉద్యోగనియామక పరీక్షల్లో అవకతవకలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీ అభ్యర్థులు ఆదివారం రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. కాగా, ఈ నిరసనల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వేలాది మంది రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రాంచీకి చేరుకుని అసెంబ్లీ భవనం వైపు ‘విధాన్ సభ ఘెరావ్’ మార్చ్ చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.

​ఏం జరిగింది?
జగన్నాథ్ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించి, కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ వైపు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వరుసగా ఆరు రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా, ఒకరికి పోలీసు లాఠీ దెబ్బ తలకు తగిలింది. రాంచీ డీఎస్పీ అజయ్ ఆర్యన్ మాట్లాడు తూ… నిరసనకారులపై ఎలాంటి బలప్రయోగమూ చేయవద్దని కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయనీ, జనసమూహాన్ని నియంత్రించేందుకు మాత్రమే వెనక్కి నెట్టామనీ, దీనిని లాఠీచార్జి కాదంటూ చెప్పుకొచ్చారు. తక్కువ ప్రభావం ఉండేలా పక్కకు టియర్ గ్యాస్ ప్రయోగించామని ఆయన వివరణ ఇచ్చారు.

తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష
జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా (జేఎల్‌‌కేఎం) నేత దేవేంద్ర నాథ్ మహతో గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు. ఇప్పటికే 10.5 కిలోల బరువు కోల్పోయినప్పటికీ… అంబులెన్స్‌లో వచ్చి మార్చ్‌లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ చిత్రపటాన్ని చేతబట్టుకుని ఆయన నిరసనలో పాల్గొనడం గమనార్హం. ‘‘మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం… నా ఆరోగ్యం క్షీణిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

​ఇంకా తీరని డిమాండ్లు
ఆదివారం జరిగిన చర్చల అనంతరం, 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే 2023, 2025లో నిర్వహించిన జేపీఎస్సీ బ్యాక్‌లాగ్ పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జేపీఎస్సీ సభ్యులు ముగ్గురూ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ‘‘పూర్తి పారదర్శకతతో న్యాయం జరుగుతుంది’’ అని హామీ ఇచ్చారు. అయితే, జేఎస్‌ఎస్సీ-సీజీఎల్‌ పరీక్షలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరపాలని విద్యార్థులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టీఎస్‌ఆర్‌ డేటా ప్రాసెసింగ్ ప్రయివేట్‌ లిమిటెడ్ ఏజెన్సీకి సంబంధించిన అన్ని పరీక్షలనూ రద్దు చేయాలని జేపీఎస్సీ-జేఎస్‌ఎస్సీ సంస్కరణల వేదిక డిమాండ్ చేస్తోంది. ‘‘ప్రభుత్వం మా 98 శాతం డిమాండ్లను అంగీకరించిందని చెబుతోంది, కానీ వాస్తవానికి మేము కోరిన 13 పరీక్షల్లో కేవలం మూడింటిని మాత్రమే రద్దు చేసేందుకు ఒప్పుకుంది’’ అని నిరసనకారులు తెలిపారు. ‘‘సీబీఐ దర్యాప్తు కోసం మా డిమాండ్ నెరవేరేవరకు మేము రాజీ పడం’’ అని నేతలు స్పష్టం చేశారు.

​జేపీఎస్సీ చైర్‌పర్సన్ అరెస్టు
నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి జేపీఎస్సీ మాజీ చైర్‌పర్సన్ ఎల్ ఖియాంగ్టేను జార్ఖండ్ సీఐడీ సోమవారం అరెస్టు చేసింది. గత నెల 28 నుంచి ఆయనను నాలుగుసార్లు పోలీసలు విచారించారు. జేఎస్‌ఎస్సీ-సీజీఎల్‌ పరీక్షలో అవకతవకలపై రాష్ట్ర పోలీసుల సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ తో పాటు పలు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం (‌పీఎంఎల్‌ఏ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా ఏర్పాట్లు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 750 మీటర్ల పరిధిలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జగన్నాథ్ ఆలయం వద్ద రేజర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 1,500 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసు, ‌క్యూఆర్‌‌టీ సిబ్బందిని మోహరించారు. నగరంలోని చాలా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఆందోళన 17వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే ప్రధాన జీవనోపాధి మార్గంగా ఉన్నందున, ఈ పరీక్షల్లో అవకతవకలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విద్యార్థి నేతలు వాదిస్తున్నారు. “మేము విద్యార్థులం, మా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి, మేము క్రమశిక్షణ కలిగినవారమని, విద్యావంతులమని నిరూపిం చుకోవాలి” అని నిరసనకారుల నేత రవీంద్ర పాశ్వాన్ మార్చ్‌కు ముందు పిలుపునిచ్చారు. ఇరువైపుల నుంచి ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వం, నిరసనకారుల మధ్య సీబీఐ దర్యాప్తు అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -