పది రోజులపాటు ఉత్కంఠ రేపిన తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ అంచనాల కందని సంచలనాలతో దేశం దృష్టిని ఆకర్షించాయి. మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కొత్తగా కలిసి వచ్చిన మిత్రపక్షాల అండతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయ వాతావరణం చల్లబడింది. ఇప్పుడప్పుడే ప్రధాన విపక్షాలు విజయ్ లక్ష్యంగా రంగంలోకి దిగక పోవచ్చు. ఈలోగా ముఖ్యమంత్రి విజయ్ సొంత బలాన్ని సమకూర్చుకొని స్థిరపడాలి. లేదంటే పరిస్థితి దినదినగండంలా మారిపోతుంది. మెజార్టీ రాకపోయినా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తమిళ రాజకీయదిగ్గజాలు రాజాజీ, కరుణానిధి స్థాయిలో విజయ్ చాణక్యం ప్రదర్శించగలడో లేదో మున్ముందు తెలుస్తుంది.
హంగ్ ఫలితాలు తమిళులకు కొత్తేమీ కాదు. 1920లో ఏర్పడ్డ మద్రాస్ ప్రెసిడెన్సి తొలి అసెంబ్లీ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ 98సీట్లకు గాను 63 గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యో ద్యమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. అనంతరం 1923, 1926, 1930, 1934 ఎన్నికల్లో తలా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన జస్టిస్ పార్టీ,స్వరాజ్ పార్టీలు ఏనాడూ మ్యాజిక్ ఫిగర్ యాభై చేరుకోలేదు. ఇతర సభ్యుల మద్దతుతోనే ఆయా ప్రభుత్వాలు కొనసాగాయి. 1935 ఇండియా చట్టం ప్రకారం 1937లో జరిగిన మద్రాస్ ప్రావిన్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. వివిధ కారణాల వల్ల 1939-45 మధ్యకాలంలో మద్రాస్ గవర్నర్ పాలనలో ఉంది. 1947 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. స్వాతంత్ర్యం వచ్చాక 1952 లో నేటి ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు కలిసిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 375 సీట్లకు గాను 152 మాత్రమే గెలుచుకుంది.
ప్రకాశం పంతులు నాయకత్వంలో ఎన్నికల అనంతరం ఏర్పడ్డ ప్రజా పార్టీ ,కృషి కార్ లోక్ పార్టీ, సీపీఐ ఐక్యకూటమి 166 సభ్యుల సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినా గవర్నర్ శ్రీ ప్రకాశ కాంగ్రెస్కే అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రాజాజీ 48 మంది సభ్యులను అదనంగా కూడగట్టి 200 ఓట్లతో విశ్వాస పరీక్ష నెగ్గి పూర్తి కాలం పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 55 ఏళ్లలో జరిగిన 11 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినా వాటిపై ఆధారపడే అవసరం లేకుండా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నారు. 1980లో ఎంజీ రామచంద్రన్ నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రధాని ఇందిరాగాంధీ రద్దు చేశారు. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే కేవలం రెండు సీట్లకే పరిమితమై ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న సాకుతో రద్దు చేయగా,1991 లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని శాంతి భద్రతల సాకుతో ప్రధాని చంద్రశేఖర్ ప్రభుత్వం రద్దు చేసింది.
ఆ రెండు సందర్భాలు మినహా 2006 వరకు రాజకీయ అనిశ్చితి తలెత్తలేదు. కానీ ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. 96 సీట్లలో గెలిచి పెద్ద పార్టీగా అవతరించిన డీఎంకే మ్యాజిక్ ఫిగర్ కు 22 సీట్ల దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి కరుణానిధి ఐదేళ్లు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇరవై ఏళ్లకు అదే పరిస్థితి నేడు పునరావృతమైంది. 234సీట్లున్న అసెంబ్లీలో 108 సీట్లు గెలిచిన విజయ్ లక్ష్యాన్ని చేరుకోలేక పోయినా చరిత్రను తిరగరాశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సాధారణ టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. స్వాతంత్ర్యం వచ్చాక తమిళనాడును పరిపాలించిన రాజాజీ, కామరాజ్, భక్తవత్సలం, అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత, స్టాలిన్ అపారమైన రాజకీయ అనుభవం గడించాక ముఖ్య మంత్రులయ్యారు.
విజయ్ మాత్రం ఏ రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం లేకుండా పార్టీ నెలకొల్పిన రెండేళ్లలోనే ఎన్నికల్లో పై చేయి సాధించి దశాబ్దాల మున్నేట్ర కజగం పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టారు. కలిసి నడుద్దాం రమ్మని కాంగ్రెస్, బీజేపీలు ఆహ్వానించినా తిరస్కరించి ఒంటరిగా ఎన్నికల్లో ముందడుగు వేయడం ఆషామాషీ కాదు. ఆరు దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలే ఆ సాహసం చేయలేదు. పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగలేదు. కోట్లాది ప్రేక్షకుల అభిమాన పాత్రులైన అగ్రహీరోలు కొందరు పార్టీలు స్థాపించినా ముందుకు నడిపించలేక మధ్యలోనే చతికిలపడి నామ మాత్రంగా మిగిలిపోయారు. దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రులయిన సినిమా హీరోల వరుసలో ముందు ఎంజీ రామచంద్రన్ తర్వాత ఎన్టీ రామారావు ఇప్పుడు జోసెఫ్ విజయ్.
తమిళగ వేట్రి కజగం(టీవీకే) పార్టీ స్థాపించిన నాటి నుండి విజయ్ ఎన్నో గండాలను, సుడిగుండాలను దాటుకుంటూ వచ్చారు. ఎవరికీ మెజార్టీ రానప్పుడు అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించే సంప్రదాయం ఒకటి ఉన్నప్పటికీ గవర్నర్ విజయ్‌ని ఐదురోజులపాటు ముప్పు తిప్పలు పెట్టారు. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే కలిసిపోతున్నాయన్న పుకార్లు, మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రాంతీయ పార్టీల దోబూచులాటలు, వెరసి తమిళనాట ప్రద ర్శితమైన రాజకీయ ఉత్కంఠ భరిత చిత్రంలో హీరోగా 144 ఓట్లతో విజయ్ అసెంబ్లీ విశ్వాసం పొంది మలి విజయం అందుకున్నారు.
అనుభవ రాహిత్యం వల్ల గవర్నర్ ముందు తన బలాన్ని ప్రదర్శించడంలో, ప్రమాణ స్వీకార సమయంలో అడుగులు తడబడినప్పటికీ విజయ్ పాటించిన సంయమనం ప్రశంసనీయం. పూర్వ ముఖ్యమంత్రి స్టాలిన్ సహా విపక్ష నేతల నివాసాలకు స్వయానా వెళ్లి సహకారం కోరడం విజయ్ పరిణతికి నిదర్శనం. విశ్వాస పరీక్ష నెగ్గడంతో ఇక విజయ్ పరిపాలనపై దృష్టి సారించవచ్చు. ఆ క్రమంలో మిత్రపక్షాల సమన్వ యంతో ముందుకు సాగడం కత్తి మీద సాము. సీపీఐ, సీపీఐ(ఎం) స్పష్టంగానే ఉన్నాయి. ప్రభుత్వంలో భాగస్వాములు కామని, తమకు మంత్రి పదవులు వద్దని, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పాయి. గవర్నర్ వ్యవహారం, కేంద్రం అజమాయిషీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడకుండా చేసే కుట్రలను తిప్పికొట్టడానికి వామపక్షాలు విజయ్‌కి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు విజయ్‌కి మద్దతిచ్చిన అన్నా డీఎంకే చీలికవర్గం భవిష్యత్తు వ్యవహార శైలి ఎలా ఉండబోతుందో ఇంకా స్పష్టం కాలేదు. మిత్రపక్షమైన డీఎంకేకు తెలియకుండానే అందరికంటే ముందుగా కాంగ్రెస్ విజయ్ కు మద్దతు ప్రకటించడం, ప్రమాణస్వీకారానికి రాహుల్ హాజరు కావడం, వామపక్షాల సహకారం సహజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కంటగింపుగా ఉంటుంది. పైగా అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని కూడా ఒక్క సీటుకే పరిమితమై దారుణ భంగపాటుకు గురైన బీజేపీ ముఖ్యమంత్రి విజయ్ ను ప్రశాంతంగా ఉండనిస్తుందా అన్నది అనుమానమే. ఎన్డీయేలో లేని పార్టీలు అధికా రంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు ఆయా ముఖ్యమంత్రులను ముప్పు తిప్పలు పెట్టడం రోజూ చూస్తున్నదే. కొన్ని సందర్భాల్లో ఆ గవర్నర్ల వైఖరిని న్యాయస్థానాలు తప్పుపట్టాయి.
అదే తమిళనాడులో ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఐదేళ్లపాటు గవర్నర్ల దాష్టీకాన్ని ఎదుర్కొన్న వారే. బిల్లుల ఆమోదం విషయంలో అలవిగాని జాప్యాన్ని భరించలేని స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఇంచార్జ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పూర్వా శ్రమంలో గోవాలో బీజేపీకి చెందిన శాసన సభ్యునిగా మంత్రిగా, స్పీకర్‌గా కూడా పని చేశారు. 2021లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యే వరకు 30 ఏళ్ల పాటు బీజేపీ క్రియాశీలనేత. రాజేంద్ర స్థానంలో రేపో మాపో కొత్తగా వచ్చే గవర్నర్ కూడా బీజేపీ నేపథ్యమున్న వారైతే కష్టాలు తప్పవు. విజయ్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రను నిలువరించిన ఒంటరియోధుడు విజయ్. తమిళ ప్రజల అస్తిత్వ ఆత్మగౌరవాలను కాపాడడంలో ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణలో విజయ్ విజయం సాధించగలడా? వేచిచూద్దాం.
డాక్టర్ అయాచితం శ్రీధర్, 9849893238
విజయ్ చాణక్యం ప్రదర్శించగలడా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



