నవతెలంగాణ – పరకాల
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి , ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ డా కన్నం నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల తహసిల్దార్,అసిస్టెంట్ ఎలక్ట్రాల్ ఆఫీసర్ తోట విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
ఓటు హక్కు – ప్రజాస్వామ్యానికి పునాది
ఈ సందర్భంగా ఆర్డీవో నారాయణ ప్రసంగిస్తూ, ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం “మై ఇండియా – మై ఓట్” (నా భారతదేశం – నా ఓటు) అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరునికి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా ఓటు హక్కు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి ఓటు హక్కు కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీ యువకులకు అతిథుల చేతుల మీదుగా ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డులను అందజేశారు.గత ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లను గుర్తించి, వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ సూర్య ప్రకాష్, ఎలక్షన్ ఆపరేటర్ రాంబాబు, ఆర్.డి.వో కార్యాలయ సిబ్బంది, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు, పరకాల పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



