జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వ కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లింబ్యా తండాలో ఇందిరమ్మ ఇల్లును సర్పంచ్ మనీ శంకర్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు పార్వతమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ..పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందన్నారు. అర్హులైన కుటుంబానికి పక్కా ఇల్లు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ఒక వరంగా మారిందని తెలిపారు.
లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, తహసిల్దార్ స్వప్న, ఎంపీడీవో గీతాంజలి, హౌసింగ్ ఏఈ మహేష్, వివిధ గ్రామాల సర్పంచులు ధర్మానాయక్, ఎడ్ల శంకర్ ముదిరాజ్, రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యులు గౌస్, జహంగీర్, జహీర్, ఉప సర్పంచ్ శ్రీను నాయక్, మండల నాయకులు వెంకట శివప్రసాద్, కంచనపల్లి నరసింహ, బాబా, శ్రీకాంత్ నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



