మంచి ధర ఉండడంతో రైతుల ఆసక్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతన్నల ఆలోచన సరళి కాలానుగుణంగా మారుతుంది.ఎప్పుడూ ఒకే రకంగా వేసే పంటలకు బదులు భిన్నంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో చాలా మంది రైతులు మొక్క జొన్న సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ సమయంలో పంట చేతికొస్తుండడంతో పాటు మార్కెట్లో ధర ఉండడంతో ఈ ఏడాది మండలంలో నాచారం,మల్లంపల్లి, ఆన్ సాన్ పల్లి,గాదంపల్లి,పెడిఫతూoడ్ల,కిషన్ రావు పల్లి, కొండంపేట తదితర గ్రామాల్లో సుమారుగా వంద ఎకరాలకు పైగా సాగు చేపట్టినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
తక్కువ పెట్టుబడి..
మొక్కజొన్న సాగుకు తక్కువ పెట్టుబడి అవుతుంది.అంతేకాక ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుండడంతో పెట్టుబడి పోను లాభాలు అర్జించవచ్చని మక్క సాగుపై దృష్టి సారిస్తున్నారు. కాకపోతే ఈ పంటకు కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయినా వాటి నుంచి పంటను రక్షించుకునేలా చర్యలు తీసుకున్నాకే వంట సాగు చేస్తున్నారు. వానాకాలంలో అత్యధిక వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరాకు సుమారుగా 5 క్వింటాళ్లలోపే దిగుబడి రావడం, మార్కెట్లో పత్తి పంటకు రైతులు ఆశించిన ధర లేకపోవడంతో ఒక్కసారి పత్తితీత పూర్తి కాగానే పత్తిని తొలగించారు. యాసంగిలో మొక్కజొన్న పంట ఆశించిన స్థాయి లో పంట దిగుబడి, ధర ఉంటుందనే ఆశతో రైతులు మొక్కజొన్న సాగు చేశారు.



