Wednesday, January 28, 2026
E-PAPER
Homeమానవిఆట‌లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి..

ఆట‌లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి..

- Advertisement -

క్రీడాకారుల సమస్యలపై పని చేస్తున్న ఎస్‌.ఎఫ్‌.ఐతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో ఉంటూనే వాలీబాల్‌ క్రీడాకారిణిగా దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టారు. క్రీడాకారులకు హర్యానా రాష్ట్రం ఇచ్చే భీమ్‌ అవార్డును సైతం అందుకున్నారు. రాష్ట్రంలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఓ క్రీడాకారిణిగా, ఉన్నత విద్యావంతురాలిగా హాయిగా జీవించేందుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పని చేయాలని ఐద్వాలోకి వచ్చారు. ఆమే జగ్మతి సాంగ్వాన్‌. ఐద్వా అఖిల భారత కార్యదర్శిగా, ప్రస్తుతం ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు వచ్చిన ఆమె క్రీడారంగంలో మహిళల పరిస్థితులపై మానవితో సంభాషించారు…

మీ బాల్యం, క్రీడారంగంలోకి ఎలా వచ్చారో చెప్పండి?
హర్యాన రాష్ట్రంలోని సోనిపట్‌ జిల్లా బూటాన్‌ గ్రామంలో పుట్టాను. మా అన్నయ్య క్రీడారంగంలోనే ఉండేవాడు. అప్పట్లో అమ్మాయిలకు ఆడుకోవడానికి పర్మిషన్‌ ఉండేది కాదు. కనీసం చూడటానికి కూడా పంపించేవాళ్లు కాదు. అయితే మా అమ్మానాన్న ఆర్యసమాజ్‌ భావాలతో ఉండేవారు. కాబట్టి నన్ను ఏమీ అనలేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా హిందీ టీచర్‌ అమ్మాయిలతో ఒక వాలీబాల్‌ టీం తయారు చేశారు. ఒకటే బాల్‌ ఉండేది. దాన్ని ఎప్పుడూ బాగు చేసుకొని ఆడుకుం టూ ఉండేవాళ్లం. ప్రత్యేక సౌకర్యా లు ఏమీ లేవు. అలాగే ప్రాక్టీస్‌ చేసి స్కూల్‌ స్థాయి పోటీల్లో రెండో స్థానం సంపాదించాం.

క్రీడారంగంలో మీ ప్రయాణం ఎలా సాగింది?
పదో తరగతి తర్వాత శిక్షణ కోసం చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర స్థాయి టీంలో స్థానం పొందాను. 1978లో స్పోర్ట్స్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్‌లో చదువు కున్నాను. కాలేజీలో 20 మందికి మాత్రమే సీట్లు ఉండేవి. అందులో సీటు వస్తే క్రీడాకారుల ఖర్చులన్నీ వాళ్లే చూసు కునేవారు. అందులో నాకు సీటు వచ్చింది. అక్కడే జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ పొందాను. 1979లో ఇండియా టీంకి ఎంపికయ్యాను. 1980లో సౌత్‌ కొరియాతో ఆడి కాంస్య పతకం అందు కున్నా. 1981లో మెక్సికో వెళ్లి ఆడాను. 1982 నా జీవితంలో ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏషియా గేమ్స్‌ మన దేశంలోనే జరిగాయి. దాంతో ఇతర దేశాలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా మంది అమ్మాయిలు ఇందులో పాల్గొన్నారు. అందులో మా టీం ఆరో స్థానంలో నిలిచింది. ఆటల్లో రాణిస్తూనే హర్యానా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశాను. అలాగే హర్యానా రాష్ట్ర క్రీడారంగంలో మహిళల స్థితిగతులపై పీహెచ్‌డీ కూడా చేశాను. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన భీమ్‌ అవార్డును కూడా అందుకున్నాను.

ఒకప్పటి క్రీడాకారిణిగా ప్రస్తుతం దేశ క్రీడా రంగంలో అమ్మాయిలకు ఎలాంటి స్థానం ఉందంటారు?
ఇటీవల కాలంలో అమ్మాయిల సంఖ్య కొంత పెరుగుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత మన దేశ క్రీడా రంగంలో ఓ పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. చాలా మంది అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆటల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే నమ్మకం కూడా వచ్చింది. దీని వల్ల తల్లిదండ్రులు కూడా కొంత ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఇలాగే మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. దీని కోసం ఐద్వా ‘ఖేల్‌ ఖదమ్‌ ఆగేలావో- లడకీయోంకో మజ్‌బూత్‌ బనావో'(ఆటల్లో ప్రోత్సహించండి – అమ్మాయిలను శక్తివంతం చేయండి) అనే నినాదం తీసుకొని పని చేస్తోంది.

క్రీడారంగంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు..?
గతం కంటే ఆడే వాళ్ల సంఖ్య పెరిగినా ఆటంకాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో దూరంగా ఉండే మైదానాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాలి. రక్షణను దృష్టిలో పెట్టుకొని చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను పంపించేందుకు భయపడుతున్నారు. రెజ్లర్లు చేసిన పోరాటం దేశం మొత్తం చూసింది. చాలా మంది అమ్మాయిలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సరైన సౌకర్యాలు లేవు. కాస్త డబ్బు ఉన్నవాళ్లు ఏదో విధంగా సొంత ఖర్చులతో టోర్నమెంట్లకు వెళుతుంటారు. కానీ పేదలకు అలాంటి పరిస్థితి లేదు. ఇలాంటి వాళ్లకు అవకాశాలు కల్పిస్తే దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు. కానీ ప్రభుత్వం ఇలాంటి క్రీడాకారిణులను పట్టించుకోవడం లేదు.

రెజ్లర్లు చేసిన ఉద్యమంలో ఐద్వాగా మీరు వాళ్లతో కలిసి పోరాడారు.. ఆ అనుభవాలు చెప్పండి?
దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చిన రెజ్లర్లు తమ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడైన బ్రిజ్‌ భూషణ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ప్రభుత్వానికి విన్నవించుకు న్నారు. కానీ అతనిపై ఎలాంటి విచారణా లేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా బుక్‌ చేయలేదు. పైగా ప్రభుత్వం అతనికి అండగా నిలబడి ముందస్తు బెయిల్‌ కూడా ఇచ్చింది. అయినా ఆ మల్లయోధులు ఎంతో ధైర్యంగా పోరాడారు. ఢిల్లీ నడివీధుల్లో తమ గొంతు విప్పారు. అయినా వాళ్ల గోడు పట్టించుకోలేదు. వీరికి ఐద్వా అండగా నిలబడింది. కేవలం ఇలాంటి సమస్యలు మల్లయోధులకు మాత్రమే కాదు బయటకు వచ్చి చెప్పుకోలేక చాలా మంది క్రీడాకారి ణులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆటలకు దూరమవుతున్నారు. కొందరు మౌనంగా భరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా అమ్మాయిలు దేశం కోసం ఆడుతున్నారు. ఒక పక్క తమ రక్షణ కోసం పోరాడాలి, మరోపక్క దేశానికి పతకాలు తెచ్చిపెట్టేందుకు పోరాడాలి.

క్రీడాకారిణుల కోసం ఐద్వా చేస్తున్న ప్రత్యేక కృషి..?
వాస్తవానికి రెజ్లర్ల పోరాటానికి ముందు ఐద్వాకు క్రీడాకారిణులతో పెద్దగా పరిచయాలు లేవు. అయితే వాళ్లు ఎప్పుడైతే తమ రక్షణ కోసం పోరాటం ప్రారంభిం చారో వారికి ఐద్వా అండగా నిలబడింది. ఇప్పటికీ ఐద్వా వారితో ఉంది. క్రీడాకారిణు లకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, ప్రభుత్వ మే అకాడమీలు ఏర్పాటు చేయాలని, కోచ్‌లను నియమించాలని, తగిన సౌకర్యాలు ఉండాలని.. ఇలా కొన్ని డిమాండ్లు పెట్టి పని చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభల్లోనూ దీనిపై ఒక కమిషన్‌ ప్రవేపెట్టాం. చిన్న దేశాలైనా క్యూబా క్రీడాకారులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ ఇంత పెద్ద దేశం మనది. రెండు మూడు మెడల్స్‌తో సరిపెట్టుకోవల్సి వస్తుంది. క్రీడాకారులు లేక కాదు, సరైన సౌకర్యాలు లేక. మన యువత ప్రతిభను పాలకులు గుర్తించడం లేదు. వీటిపై భవిష్యత్తులో ఐద్వాగా మరింత కృషి చేయాలనుకుంటున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పని చేయబోతున్నాం.

యువ క్రీడాకారిణులకు మీరేం చెప్తారు?
క్రీడలంటే కేవలం సరదా కోసం, ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. ఆటల వల్ల అమ్మాయిల్లో అత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ధైర్యంగా ఉండగలుగుతారు. అందుకే ఆటలు ప్రతి అమ్మాయి జీవితంలో ఓ భాగం కావాలని ఐద్వా కోరుకుంటుంది. అలాగే మన ప్రధాని ప్రతిచోట బేటీ బచావో – బేటీ పడావో అంటున్నారు. కానీ ఇది ఆచరణలో లేదు. అలాగే ఇటీవల అమ్మాయిలు తమ స్వశక్తితో క్రీడల్లో మంచి పతకాలు సాధించడం మొదలుపెట్టిన తర్వాత ‘బేటీ ఖిలావో’ అని కూడా అంటున్నారు. ఊరికే మాటలు చెబితే పతకాలు రావు. దానికి తగిన శిక్షణ ఉండాలి. సౌకర్యాలు కల్పించాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి. అయితే ఆడవాళ్లు అసలు బయటకే రావొద్దు అని ప్రచారం చేస్తున్న నేటి బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఇది సాధ్యం కాదు. అందుకే ఈ మనువాద ప్రచారకులను తరిమికొట్టడమే ఐద్వా లక్ష్యంగా పెట్టుకుంది.

ఉద్యమాలతో ఎలా పరిచయం..?
నేను కాలేజీలో చదివేటప్పుడు భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఐ)తో పరిచయం. కాలేజీల్లో క్రీడాకారుల సమస్యలపై బాగా పని చేసేవారు. సౌకర్యాలు కల్పించాలని పోరాడేవాళ్లు. అలా ఎస్‌.ఎఫ్‌.ఐ చేసే కార్యక్రమాలు నచ్చి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను. మహిళా సమస్యలపై, సమాజం మార్పు కోసం పని చేయాలనే ఉద్దేశంతో చదువు పూర్తి చేసిన తర్వాత ఐద్వాలో పని మొదలుపెట్టాను. 1985లో మా హర్యానా రాష్ట్రంలో ఐద్వా ఏర్పడింది. మొదటి కార్యదర్శిగా పని చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఐద్వాతోనే ఉన్నాను.

– సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -