అరుణ మరణ వార్త నాకు మూడు రోజులు ఆలస్యంగా తెలిసింది. అంతకు ముందే ఆమె అనారోగ్యం గురించి విన్నాను గానీ, నా ఆరోగ్యం బాగోలేక ఐదేండ్ల నుండి మహబూబ్ నగరంలోనే వుండడం వల్ల బయటి ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు లేకుండా పోయాయి. అయితే మొదట్లో నాకు తెలిసిన పెద్ద కళ్ళతో అమాయకంగా చూసే అరుణకు ఆ తరువాత ఆమెతో జరిగిన విప్లవాత్మకమైన మార్పుల గురించి అందరితో పంచుకోవాలనే వుద్దేశ్యంతోనే నేను అతి కష్టం మీద కలం పట్టుకున్నాను.
(ఈ రోజు కా|| అరుణ సంస్మరణ సభ)
అరుణ కంటే ముందు నాకు పరిచయం సాంబిరెడ్డి గారితోనే. 1989లో అనుకుంటాను ఒక రోజు సాయంత్రం నేను ఆఫీసు నుంచి వచ్చేసరికి ఇంట్లో మధుతో పాటు సాంబిరెడ్డి గారు వున్నారు. వంటింట్లోకి వెళ్లి చూస్తే పొద్దున్న చేసిన ఇడ్లీలు మిగిలి వున్నాయి. వాటిని ముక్కలుగా కట్ చేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలతో తాలింపు పెట్టి, నిమ్మకాయ పిండి రెండు ప్లేట్లలో సర్ది, స్పూనులు వేసి ఇద్దరికీ ఇచ్చాను. దీనిని నెల్లూరు జిల్లాలో ఛియాలి అని పిలుస్తారు. సాంబి రెడ్డి గారు దాన్ని రుచి చూస్తూ, భలే బాగుందండీ. మా ఇంట్లో కూడా ఇడ్లీలు మిగులుతాయి గాని ఇలా ఎప్పుడూ చెయ్యరు- అన్నారు. నేను నవ్వి ‘అది ఇడ్లీలమహత్యం కాదులెండి. స్పూనుతో తినడం వల్ల వచ్చిన రుచి’ అన్నాను. అప్పుడు మేం కొత్తగా హైదరాబాదుకు మకాం మార్చి ఆదర్శనగర్‌లోని న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్‌లో చేరాం.
ప్రతిభ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేరి ఇంకా ఏడాది నిండకుండానే వారానికి ఒకసారి ఇంటికి వచ్చేస్తుండడంతో నేను విజయవాడ నుండి హైదరాబాద్ బదిలీ చేయించుకుని వచ్చాను. కాకతాళీయంగా అప్పుడే పార్టీ రాష్ట్ర కేంద్రం కూడా హైదరాబాదుకు మార్చడం వల్ల ముగ్గురం ఒకే దగ్గర వుండగలిగాం. సాంబిరెడ్డి గారు వత్తిరీత్యా లెక్చరర్. ఆయన గొప్పతనం ఏమంటే ఎన్ని చోట్లకు బదిలీ అయినా, అక్కడ విద్యార్థి ఉద్యమం నిర్మించేవాడు. ఆయన నిరాడంబరత్వం, అతి సౌమ్యంగా వ్యవహరించడం అందరం చూశాం. అలాంటి సాంబిరెడ్డి గారు అరుణకు మొదటి గురువు. ఆమె తన పట్టుదలతోనే కమ్యూనిస్టుగా మారింది. నిశ్శబ్దంగా ఎదిగింది. ఇంటిని చక్కదిద్దుకుంటూనే పార్టీ నాయకురాలిగా తయారైంది. పెద్ద కళ్ళతో అమాయకంగా చూసే అరుణలో ఇంతటి ప్రజ్ఞా పాటవాలు వున్నాయని ఎవరూ ఊహించలేరు.
అప్పట్లో అరుణను నేను అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఒకసారి ఏదో రాజకీయ క్లాసులకు ఇద్దరం హాజరయ్యాం. వాటికి ఆమె తనతో పాటు ఒక లెక్చరర్ భార్యను కూడా తీసుకు వచ్చింది. ఆరోజు నేను వాళ్లిద్దరిని మా ఇంటికి తీసుకు వెళ్ళాను. వచ్చిన ఆమెకు పార్టీ కొత్త. అరుణ ఆమెను ఎంతో ఓపిగ్గా తనతోపాటు అన్ని విషయాలను అర్థం చేయిస్తూ వుండడం నన్ను ఆకట్టుకుంది. తరువాత చాలాసార్లు మేము కలిశాం. మా ప్రతిభ, అరుణ వాళ్ల అబ్బాయి అంజి రెడ్డి వైద్య విద్యలో వున్నారు.
నేను అరుణ వేర్వేరు రంగాలలో పని చేయడం వల్ల మా మద్య పరిచయం పెరగలేదు. ఒకసారి కామ్రెడ్ సి.హెచ్. నర్సింగ రావు మాత్రం నాతో ‘అక్కా! నీలాగానే అరుణ గారు కూడా ఇంటికి వచ్చిన వాళ్లందరికీ కడుపునిండా భోజనం పెడతారు’ అన్నాడు. అరుణ మహిళా సంఘం కార్యక్రమంలో చురుగ్గా వుంటుందనీ, పనిలో చాలా నిక్కచ్చిగా వుంటుందనీ విన్నాను. ఒకసారి అదినాకు అనుభవమయింది కూడా. నన్ను మహిళా సంఘం రాష్ట్ర కమిటీవాళ్లు బెంగుళూరు వెళ్లి, ఒక కోర్టు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనమని చెప్పారు. వెళ్తున్నప్పుడు అరుణ నన్ను కలిసి బెంగుళూరు మహిళా సంఘం ఆఫీసులో ఒక కవరు ఇవ్వమని ఇచ్చింది. నేను బెంగుళూరు వెళ్లి, ఆ కోర్టు పనిచూసుకుని మహిళా సంఘం ఆఫీసులో అరుణ ఇచ్చిన కవరు ఇచ్చి వచ్చాను. అంతే, సంగతి మర్చిపోయాను. ‘ఒక రోజు అరుణ నన్ను కలిసి నాకిచ్చిన కవరును బెంగుళూరులో ఇచ్చినట్లు రసీదు తెచ్చావా’ అని అడిగింది. నేను తెల్లమొహం వేశాను. నేను ఆమె చెప్పినట్లు కవరు భద్రంగా ఇచ్చివచ్చానే గానీ, రసీదు సంగతి మర్చిపోయాను. అంతే, అరుణ నన్ను చాలా తీవ్రంగా మందలించి, నేను ఇప్పుడు ఆ ఫైల్ ఎలా క్లోజ్ చేసుకోవాలి అన్నది.
నేను అప్పటికి 20 ఏళ్ల నుండి ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాను గాని ఆఫీసు పద్దతులు నాకు తెలియవు. నా దగ్గరి గుమాస్తాలే ఆ వ్యవహారాలు చూసుకునే వారు. ఆ విషయం మేం అప్పుడే మర్చిపోయాం గాని ఆమె పని పద్దతి మాత్రం నాకు చాలా నచ్చింది. అరుణ హైదరాబాద్ నగర కమిటీ ఐద్వా కార్యదర్శిగా సిటీ పార్టీ నగర కమిటీ సభ్యురాలిగా పని చేసింది. తను లెక్చరర్ భార్య అనే గర్వం కానీ, బేషజం గాని వుండేవి కావు. అరుణ అల్ప సంతోషి, ఒకసారి తనకు అంజి రెడ్డి ఒక ఒరిస్సా చీర తీసుకువస్తే నాకు ఎంతో మురిపెంగా చూపించింది. తరువాత మా అమ్మాయి కూడా తన తొలిసంపాదనతో అరుణకు ఒక చీర కొనిచ్చింది. మా కుటుంబాల మధ్య నెలకొన్న సాన్నిహిత్యం గురించి చెప్పడం కోసమే ఈ ప్రస్తావన.
అరుణ వంట పని, ఇంటి పని, మహిళా సంఘం కార్యక్రమాలు అన్నింటికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చి గొప్పగా నిర్వహించింది. ఆ పని అందరికీ సాధ్యం కాదు. మనకిచ్చిన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి రక రకాలకుంటి సాకులు చెబుతాం. కాని ఆ అవరోధాలను అధిమించిన వారే అరుణ లాగా జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ రకంగా అరుణ జీవితం మనకొక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. సాంబిరెడ్డి గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా వచ్చిన సొమ్మును కూడా బంగారం కోసం ఖర్చు పెట్టకుండా కుమారుడి చదువు, కుటుంబ నిర్వహణ కొరకే వెచ్చించింది.
ఒకసారి హైదరాబాద్‌లో ఒక సిటీ కార్యక్రమం విజయోత్సవ సభలో కామ్రెడ్ బి.వి. రాఘవులు గారు ఆమెను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, అరుణ కళ్లల్లో వెలిగిన విజయ దరహాసం నాకింకా గుర్తుంది. అనారోగ్యం అరుణ ప్రాణాలను త్వరగా కబళించింది కాని ఇంకా చాలా ఏళ్లపాటు ఉద్యమంలో వుండవలసిన వ్యక్తి. ఇప్పుడు సాంబిరెడ్డి గారికి 90 ఏళ్లు. వయసులోనూ, వార్థక్యంలో కూడా తోడు చాలా అవసరం. సాంబిరెడ్డి గారి స్వభావ రీత్యా చిదానందమూర్తి, ఆరోగ్యం బాగానేవుందని నాతో ఈ మధ్యనే ఫోనులో చెప్పారు. కుమారుడు డాక్టర్ అంజిరెడ్డి, కోడలు డాక్టర్ రాధిక బహు సౌమ్యులు. వాళ్లిద్దరూ ఆయనను బాగా చూసుకోగలరనే నమ్మకం నాకుంది. వారి మనుమలకు నా ప్రగాఢ సానుభూతి.
– వి. సుమతి
నేనెరిగిన అరుణ
- Advertisement -
- Advertisement -