వచ్చే మూడ్రోజులూ భారీ వర్షాలే

Heavy rains for the next three days– అక్కడక్కడా అతి భారీ వర్షం కురిసే అవకాశం
– నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు
– శుక్రవారం రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న హెచ్చరించారు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. రానున్న రెండురోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. అదే సమయంలో రాష్ట్రం మీదుగా నైరుతి పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడా అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వాన పడే అవకాశముంది. అయితే, కొన్ని సార్లు తీవ్రమైన జల్లులతో పాటు ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. శుక్రవారం ఉదయం ఎనిమిదున్నర గంటల నుంచి రాష్ట్ర 10 గంటల వరకు రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా ఆరు సెంటీమీటర్ల వాన పడింది.
ఆరెంజ్‌ హెచ్చరిక జాబితా ఇలా(భారీ నుంచి అతి భారీ వర్షాలు)
31.8.24 : ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ
1.9.24 : ఆదిలాబాద్‌, కొమ్రం అసిఫాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
2.9.24 : ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి
ఎల్లో హెచ్చరిక జాబితా ఇలా(భారీ వర్షాలు)
31.8.24 :నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల
1.9.24 : మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి
2.9.24 : కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్‌

Spread the love