నవతెలంగాణ – చెన్నై : ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం (ఎఐఎడిఎంకె) పార్టీ నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న తమిళిట వెట్రి కజగం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎఐఎడిఎంకెకు చెందిన నలుగురు మాజీ మంత్రులు ఎం.సి సంపత్, ఎన్.ఆర్ శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్లు శనివారం టివికెలో చేరారు. ఈ నలుగురు చెన్నై శివార్లలో పనైయూర్‌లో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్, మరికొందరు మంత్రుల సమక్షంలో టివికె పార్టీ కండువా కప్పుకున్నారు.
శివపతి మినహా, టీవీకేలో చేరిన మిగతా ముగ్గురు మాజీ మంత్రులు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. శివపతి 1991 తొట్టాయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2011లో ముసిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయన విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. ఇక సంపత్ 2001- 2006 నెలికుప్పం నియోజకవర్గం నుండి, 2011- 2022 మధ్య కడలూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈయన వివిధ శాఖల్ని నిర్వహిస్తూ మంత్రిగా చేశారు. సి. రాజు 2011 నుంచి కోవిల్‌పట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఈయన 2016-2021 మధ్యకాలంలో సమాచార ప్రచార శాఖా మంత్రిగా పనిచేశారు. ఇక రాధాకృష్ణన్ 2016-2021 మధ్య కాలంలో డుమలైపేట్టై అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు.


