స్పష్టం చేసిన ప్రతిపక్షం
ప్రతిపక్షాన్ని బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నాలు
డీలిమిటేషన్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సన్నాహాలు..!
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువతపై దాడికి కేంద్ర హోం మంత్రి వివరణ ఇవ్వాలనీ, అయోధ్యలోని రామ మందిర దోపిడీపై చర్చించాలని కోరడంతో పాటు, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు పార్లమెంటు లోపలా వెలుపల తమ ఆందోళనను కొనసాగిస్తామని ప్రతిపక్షం స్పష్టం చేసింది. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అట్టుడికిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం తమ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బుధవారం ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిన అనంతరం, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని రాహుల్ ఛాంబర్‌లో సుమారు 50 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ తదితరులు పాల్గొన్నారు. సభ సజావుగా సాగేందుకు ఆయన సహకారాన్ని కోరారు. హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వడం, దోపిడీపై చర్చించడం వంటి డిమాండ్లను అంగీకరించే వరకు నిరసన కొనసాగుతుందని రాహుల్ అన్నారు. ఈ భేటీలో వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లు, ఫారిన్ కంట్రిబూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే.. రిజిజు అభ్యర్థనను రాహుల్ పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ, అలాగే ఢిల్లీలో జులై 20న జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసే వరకు సభలో కార్యకలాపాలను అడ్డుకుంటామని రిజిజుతో రాహుల్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్‌తో సమావేశం అనంతరం, కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాన్ని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతాయని కిరణ్ రిజిజు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్‌తో సహా ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు.
డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజ ర్వేషన్‌ను అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు, కేంద్ర ప్రభుత్వం మూడురోజుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల స్పందనను కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం మధ్య చీలిక (ఈ వర్గం నుంచి పలువురు ఎంపీలు ఎన్డీఏలోకి వచ్చారు), ఇండియా బ్లాక్ నుంచి డీఎంకే దూరంగా ఉండటం వంటి అంశాలు బిల్లు ఆమోదానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లును ఆమోదింపజేయ డంలో సహాయపడాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అభ్యర్థిస్తోంది. బిల్లుకు మద్దతు ఇవ్వలేకపోతే ఓటింగ్‌కు దూరంగా ఉండి సహకరించాలని తెలిపింది. ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం మద్దతును కూడగట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక గతంలోనే లోక్‌సభలో వీగిపోయింది.
బిల్లు నెగ్గడం కష్టమే
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల ఎన్డీఏలో భాగమైన శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఉన్నారు. వీరికి తోడుగా, 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, ఎనిమిది మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ వర్గం మద్దతును కూడా ప్రభుత్వం ఆశిస్తోంది. ఒకవేళ డీఎంకే, పవార్ వర్గం, తృణమూల్ తిరుగుబాటుదారుల మద్దతు లభించినా, ఎన్డీఏ మెజారిటీ 348 స్థానాలకే పరిమితమవుతుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇవ్వడం తమకు కష్టమని డీఎంకే ప్రభుత్వానికి తెలియజేసింది. ఒకవేళ డీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం నుంచి కచ్చితంగా విఫలమయ్యే మరో రాజకీయ ఎత్తుగడ వస్తుందేమోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ నుంచి ఇంకా కోలుకోని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఎదురుదెబ్బను తట్టుకోగలవా అనే ప్రశ్న కూడా తలెత్తింది.
డీలిమిటేషన్‌పై గత సమావేశాల్లోనే
వైఖరిని స్పష్టం చేశాం
డీలిమిటేషన్ బిల్లుపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ స్పందించారు “మాకేమీ తెలియదు. ప్రత్యేక సమావేశం ఉద్దేశం ఏమిటి? ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డీలిమిటేషన్‌పై చర్చించడానికి, ప్రతిపక్షాల వైఖరి తెలుసుకోవడానికి మమ్మల్ని కలిశారు. డీలిమిటేషన్‌పై మా వైఖరి చాలా స్పష్టం. గత పార్లమెంట్ సమావేశాల్లో మా వైఖరి ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు. ‘ప్రభుత్వ ఎజెండాతో, ప్రధానమంత్రి ఎజెండాతో’ కలిశారని అన్నారు. ‘పార్లమెంటు చర్చలు, సంప్రదింపుల కోసమే ఉంది. వారికి ఎలాంటి చర్చ, సంప్రదింపులు వద్దు. వారు అన్నింటినీ కూల్చివేయాలని చూస్తున్నారు. వారు వేరే చట్టాలను తీసుకురావాలని చూస్తున్నారు, దానికి మేము ఏమాత్రం అంగీకరించలేము. ఈరోజే అదే జరిగింది’’ అని ఆయన అన్నారు. “ప్రభుత్వం దీనికి పరిష్కారం ఇవ్వాలి. మేము ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాము. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై దారుణంగా దాడి చేశారు. బీహార్‌లో ఎకె-47ని ఉపయోగిస్తున్నారు. దేశ హోం మంత్రి నుంచి సమాధానం రావాలి. ఆయన ఎందుకు పారిపోతున్నారు? ‘చందా చోరీ’ , రామ మందిరం విషయంలోనూ సమాధానం లేదు. మేము కేవలం చర్చను మాత్రమే కోరుతున్నాము. రామ మందిర విరాళం విషయంలో ఏం జరిగింది? ‘భక్తులు’ అని చెప్పుకునే ఈ వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా శ్రీరాముడి డబ్బును దొంగిలిస్తున్నారు. జవాబుదారీతనం లేదు, సరైన విచారణ జరగడం లేదు” అని వేణుగోపాల్ అన్నారు.
ఆందోళనను కొనసాగిస్తాం
- Advertisement -
- Advertisement -



