ఆదివాసీ స్కూల్ ఠీక్ కరోకు గడ్చిరోలిలో శ్రీకారం
మౌలిక వసతుల లేమి.. భద్రతా సమస్యలపై దృష్టి
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి : సీజేపీ కన్వీనర్ అభిజీత్ దిప్కే
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ ప్రచారానికి నేడు మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి సీజేపీ శ్రీకారం చుట్టింది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దిప్కే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదివాసీ పాఠశాలలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, వసతి, విద్యా సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్టు తెలిపారు. దేశంలోని ఆదివాసీ ప్రాంతాల పాఠశాలలు గత 80 ఏండ్లుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని దిప్కే ఆరోపించారు. అనేక ఆదివాసీ విద్యార్థులు విద్య, మౌలిక సదుపాయాల విషయంలో వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు.
తరగతి గదికి దూరమైన హక్కు
ఆదివాసీ పిల్లలకు విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అయినప్పటికీ, దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో అది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శించారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీరు, పడకలు, విద్యుత్, భద్రత వంటి ప్రాథమిక సదుపాయాల కొరత కొనసాగుతోందని దిప్కే ఆరోపించారు. కొన్ని ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందడం లేదని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, ఆదివాసీ విద్యార్థుల పాఠశాలలకు మాత్రం నిధుల కొరతను చూపుతున్నాయని విమర్శించారు.
విద్యార్థుల ప్రాణాలకు రక్షణేది?
ఆదివాసీ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై కూడా తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల గడ్చిరోలిలోని ప్రభుత్వ సహాయంతో నడిచే ఆశ్రమ పాఠశాలలో పాముకాటుకు ముగ్గురు ఆదివాసీ విద్యార్థులు మరణించిన ఘటన నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. విద్యార్థుల ఆందోళనలు, పాఠశాలల పరిస్థితిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ముంబయి హైకోర్టు కూడా విద్యార్థుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో గత రెండేండ్లలో 590 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు మరణించారని దిప్కే ఆరోపించారు. పాముకాట్లు, ఆహార నాణ్యతాలోపం, పాఠశాలల్లోని మౌలిక వసతుల లేమి తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. అయితే ఇటువంటి ఘటనలకు తగిన స్థాయిలో స్పందన ఉండటం లేదన్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో గత రెండు నెలల్లో 30 మందికి పైగా ఆదివాసీ విద్యార్థులు మరణించారని ఆయన తెలిపారు. చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లోనూ ఆదివాసీ విద్యార్థుల మరణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
‘ఏకలవ్య’ పాఠశాలల పరిస్థితి?
ఆదివాసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 720 ఏకలవ్య పాఠశాలల్లో 477 పనిచేయడం లేదని దిప్కే ఆరోపించారు. సిబ్బంది కొరతతో పాటు మౌలిక సదుపాయాల లోపం కూడా విద్యార్థుల విద్యపై ప్రభావం చూపుతోందని ఆయన తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
లాభాల లెక్కలు కాదు.. బిడ్డల భవిష్యత్ ముఖ్యం
దేశ ఆర్థికాభివృద్ధి, జీడీపీ వృద్ధి, పెద్ద ఆర్థిక లక్ష్యాల గురించి ప్రభుత్వాలు మాట్లాడుతున్న సమయంలో ఆదివాసీ బిడ్డలకు కనీస విద్యా సదుపాయాలు కూడా అందకపోవడం సామాజిక అసమానతలకు అద్దం పడుతోందని దిప్కే విమర్శించారు. పట్టణాల్లోని ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భవిష్యత్ ఎంత ముఖ్యమో, మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భవిష్యత్ అంతే ముఖ్యమన్నారు. పెద్ద ఆర్థిక లక్ష్యాల గురించి మాట్లాడటంతో పాటు ఆదివాసీ విద్యార్థులకు విద్య, భద్రత, వసతి, మౌలిక సదుపాయాలను కల్పించడానికీ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆదివాసీ పిల్లల విద్యకు కేటాయించే నిధులు సకాలంలో విడుదలై, క్షేత్రస్థాయిలో పూర్తిగా ఖర్చయ్యేలా సామాజిక పర్యవేక్షణ అవసరమన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలన
గడ్చిరోలిలో ప్రారంభం కానున్న ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ ప్రచారం ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. ప్రభుత్వం అధికారికంగా సమస్యలను గుర్తించి, బాధ్యతలను నిర్ణయించి, అవసరమైన నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని సీజేపీ అభిప్రాయపడింది. ఈ ప్రచారంలో పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ప్రచారం ఉద్దేశమని దిప్కే తెలిపారు. గత నెలలో సీజేపీ దేశవ్యాప్తంగా ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగు పరచాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభించిన విషయం విధితమే. దానికి కొనసాగింపుగానే ఆదివాసీ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు దిప్కే వెల్లడించారు.


