Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంప్రజా సంక్షేమానికి పెద్ద పీట

ప్రజా సంక్షేమానికి పెద్ద పీట

- Advertisement -

సామాజిక భద్రత, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
ఆశా, అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు పెంపు
నిరుద్యోగ యువతకు నెలకు రూ.1000 సహాయం
కేరళ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విజయన్‌ ప్రభుత్వం

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్‌ బాలగోపాల్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాజిక భద్రత, ఉపాధి సహాయం, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుత పినరయి విజయన్‌ ప్రభుత్వానికి ఇది చివరి పూర్తి బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో కేరళలోని సీపీఐ(ఎం) నేతృత్వంలో గల లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆశా వర్కర్లకు నెలకు రూ.1000 గౌరవ వేతన పెంపు ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకు అదనంగా రూ.1000, అంగన్వాడీ హెల్పర్లకు రూ.500 పెంచారు. సామాజిక భద్రత పెన్షన్ల కోసం రూ.14,500 కోట్లు కేటాయించారు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్న కేరళలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘వృద్ధుల బడ్జెట్‌’ ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి ప్రకటించారు.

నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి ‘కనెక్ట్‌ టు వర్క్‌’ స్కాలర్‌షిప్‌ పథకం కింద 18-30 ఏండ్ల మధ్య వయసుగల విద్యావంతులైన నిరుద్యోగులకు ఒక ఏడాది పాటు నెలకు రూ.1000 ఇవ్వనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. వయనాడ్‌ బాధితుల పునరావసంలో భాగంగా మొదటి విడత ఇండ్లను ఫిబ్రవరి మూడో వారం నాటికి అందజేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ వరకు రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) ప్రాజెక్ట్‌ కోసం ప్రాథమిక పనులకు రూ.100 కోట్లు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం అదనంగా రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. గిగ్‌ వర్కర్ల పని పరిస్థితులు మెరుగుపర్చేందుకు.. వారికి విశ్రాంతి, ఆధునిక సౌకర్యాలు కల్పించేలా ‘గిగ్‌ హబ్‌’లు ఏర్పాటు చేయడానికి రూ.20 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వ, ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో ఐదు రోజుల పాటు ఉచిత చికిత్స అందించను న్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మానవ- వన్యప్రాణి సంఘర్షణ నివారణ, నష్టపరిహారం కోసం రూ.100 కోట్లు, శబరిమల మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా క్లీన్‌ రివర్‌ పంప ప్రాజెక్ట్‌ కోసం రూ.30 కోట్లు కేటాయించారు. సాంస్కృ తిక ప్రోత్సాహం కోసం రాష్ట్రంలో శాశ్వత కళా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొదట తిరువనంతపురంలో ప్రారంభించి.. తర్వాత కొచ్చి, కోజికోడ్‌కు విస్తరిస్తారు. మాజీ ముఖ్య మంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ స్మారకంగా యువతకు ఆయన జీవన విలువలు నేర్పించే కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.20 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌ ద్వారా సామాజిక భద్రత, ఉపాధి కల్పన, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్థిక మంత్రి కె.ఎన్‌ బాలగోపాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -