Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంజీడీపీ వృద్ధిరేటు తగ్గుదల

జీడీపీ వృద్ధిరేటు తగ్గుదల

- Advertisement -

ద్రవ్యోల్బణం పెరుగుదల
రూపాయి విలువ పతనమైనా..దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించదు
2026-27 ఆర్థిక సర్వే అంచనా
పార్లమెంట్‌లో సర్వేను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గుతుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అలాగే రూపాయి విలువ పతనమైనా.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించదని పేర్కొంది. గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.4 శాతంగా అంచనా వేయగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.8-7.2 శాతానికి ఆర్థిక సర్వే అంచనా వేసింది.

గత ఏడాది కంటే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఆహారం, ఇంధన ధరలు స్థిరంగానే ఉంటాయని తెలిపింది. ధృఢమైన మైక్రో ఫండమెంటల్స్‌, సంస్కరణలు వృద్ధికి బలం ఇస్తున్నాయని వెల్లడించింది. కేంద్ర ఖజానాకు లోటు తగ్గనుందని, ఆర్థిక పరిమితికి కట్టుబడి ఉందని పేర్కొంది. తయారీ, సేవల రంగం, గిగ్‌ ఎకానమీ విభాగాల్లో ఉద్యోగ సృష్టి మెరుగుపడినట్టు తెలిపింది. వాస్తవాలకు భిన్నంగా ఈ సర్వే ఉన్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎగుమతులపై పెరుగుతున్న నియంత్రణలు అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక తిరస్కరణలు, కార్బన్‌ పన్ను విధానాల మధ్య దేశంలో స్వదేశీపై దృష్టి పెట్టడం అనివార్యం, అవసరం అని ఇది ప్రపంచీకరణ ముగింపును సూచిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఇండియా-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దీనివల్ల ఎగుమ తులు, పోటీతత్వం పెరగనున్నాయని అన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా 2.0’ పై దృష్టి కేంద్రీకరించి.. ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్టు తెలిపారు. డిజిటల్‌ పేమెంట్లు, ఫిన్‌టెక్‌, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతూ ఇండియాను ప్రపంచస్థాయి టెక్‌ హబ్‌ గా మలుస్తున్నాయని అన్నారు.

సౌర, వాయు, హైడ్రోజన్‌ వంటి గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా మద్దతు కొనసాగుతోందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల లో ఇండియా ఒకటిగా మారుతున్న తరుణంలో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన అల్ట్రా-ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాల వినియోగం పెరుగుతుండటంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం నుంచి రాత్రి చివరి వరకు వాటి ప్రకటనలపై నిషేధం విధించాలని సూచించింది. పిల్లలలో పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గిస్తూనే, శిశువులు, పసిపిల్లల పాలు, పానీయాల మార్కెటింగ్‌పై పరిమితులను విధించాలని సూచించింది. ”ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఐదేండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అధిక బరువు ప్రాబల్యం 2015-16లో 2.1 శాతం నుంచి 2019-21లో 3.4 శాతానికి పెరిగింది” అని సర్వే వెల్లడించింది.

రూపాయి పతనంపై…
దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం రూపాయి విలువ. గత నెలలో ఇది రికార్డు స్థాయిలో పడిపోయింది. చరిత్రలో మొదటిసారిగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 92కు చేరింది. అయితే ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబించడం లేదని ఆర్థిక సర్వే తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే రూపాయి తన వాస్తవ సామర్ధ్యానికి తగినట్లు లేదు’ అని చెప్పుకొచ్చింది.

ఆన్‌లైన్‌ తరగతులను తగ్గించాలి
సోషల్‌ మీడియా యాక్సెస్‌ కోసం వయోపరిమితిని, ఆన్‌లైన్‌ తరగతులను తగ్గించాలని ఆర్థిక సర్వే పేర్కొంది. పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం విధించాలనే సూచనలను తీసుకుంటూ..డిజిటల్‌ వ్యసనాన్ని నివారించడానికి ఆన్‌లైన్‌ బోధనను తగ్గించుకుంటూనే, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు వయస్సు ఆధారిత ప్రాప్యతను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక సర్వే పేర్కొంది. పిల్లల డిజిటల్‌ అలవాట్లను రూపొందించడంలో, ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌కు గురికాకుండా నిరోధించడానికి పిల్లలకు విద్యా కంటెంట్‌ యాక్సెస్‌ కోసం సరళమైన పరికరాలను ప్రోత్సహించడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని సర్వే సూచించింది. అదే విధంగా 8వ తరగతి దాటిన విద్యార్థులను నిలుపుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ఓపెన్‌ స్కూలింగ్‌కు మద్దతు ఇచ్చింది. గ్రామీణ-పట్టణ పాఠశాల అసమానతలను, విధానపరమైన జోక్యాల అవసరాన్ని స్పష్టం చేసింది.

ఆర్టీఐపై పున :పరిశీలన అవసరం
దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆర్టీఐ చట్టాన్ని పున:పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. పున :పరిశీలించడమంటే, దాని స్ఫూర్తిని నీరుగార్చడం కాదని తెలిపింది. ప్రపంచ ఉత్తమ పద్ధతులతో దానిని అనుసంధానం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న అంశాలను చేర్చడానికి, దాని అసలు ఉద్దేశానికి పున:పరిశీలన అవసరమని తెలిపింది.

ఉపాధి మద్దతుకు లేబర్‌ కోడ్‌ల అమలు కీలకం
కార్మిక కోడ్‌లు గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికులను అధికారికంగా గుర్తించాయని, సామాజిక భద్రత, సంక్షేమ నిధులు, ప్రయోజన పోర్టబిలిటీని విస్తరిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. సమర్థవంతమైన అమలు అధికారిక ఉపాధికి మద్దతు ఇవ్వడంలో, మహిళలు, గిగ్‌ కార్మికులకు భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది.

ఏఐ మౌలిక సదుపాయాలపై హెచ్చరిక
ఏఐతో నడిచే ప్రపంచ పరిస్థితిని వివరిస్తూ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే దారుణ పరిణామాలతో వ్యవస్థాగత షాక్‌కు దారితీస్తుందని, ఇది దేశ ఐటీ ఆధారిత వైట్‌-కాలర్‌ జాబ్‌ ఇంజిన్‌కు ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ సర్వేపై ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ మాట్లాడుతూ ఆర్థిక సర్వే కఠినమైన అమెరికా సుంకాలు, ఏఐ నేతృత్వంలోని వృద్ధి చుట్టూ అనిశ్చితితో సహా అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారతదేశం ఎలా ఎదుర్కోవాలో వివరిస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐఎంఎఫ్‌ 7.3 శాతం అంచనా, ప్రపంచ బ్యాంకు 7.2 శాతం అంచనాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. అయితే 2027 ఆర్థిక సంవత్సరం వృద్ధి కొద్దిగా తగ్గుతుందని అంచనా వేశారు.

రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీడీపీలో 4.4 శాతం ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ తెలిపారు. సార్వభౌమ రుణ ఖర్చులను సరసమైనదిగా ఉంచడానికి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యలు మా నియంత్రణలో లేవు
చేతులెత్తేసిన కేంద్రప్రభుత్వం

భారత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సమస్యలు ఆంతరంగికమైనవి కావని, అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి అవేవీ ప్రభుత్వ నియంత్రణలో ఉండవని ఆర్థిక సర్వే తెలిపింది. ‘గత సంవత్సరం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశం దశాబ్దాలుగా అత్యంత బలమైన స్థూల ఆర్థిక పనితీరును కనబరచింది. అయితే ఇకపై అది, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో తలపడాల్సి ఉంటుంది. దీనివల్ల కరెన్సీ స్థిరత్వం, మూలధన ప్రవాహం లేదా వ్యూహాత్మక రక్షణలు వంటి విజయాలు సాధ్యం కాకపోవచ్చు’ అని వివరించింది.

నిరాశావాదం తగదు
2025-26 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం, స్థూల విలువ ఆధారిత వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చునని సర్వే ముందస్తు అంచనా వేసింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిపత్తిని పునరుద్ఘాటిస్తోందని పేర్కొంది. 2026-27లో జిడిపి వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 శాతం వరకు వుండగలదని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచం అనిశ్చితి, ఆందోళనలు, అస్థిరతల మధ్య ఊగిసలాడుతున్నా దేశం స్థిరమైన వృద్ధిని సాధించే అవకాశం వుందంటూ నిరాశావాదం తగదని హితవు పలికింది.

అంతర్జాతీయ సంస్థలకు భిన్నంగా వృద్ధిరేటు అంచనాలు
అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన నివేదికలకు ఆర్థిక సర్వే భిన్నంగా ఉండడం గమనార్హం. ఉదాహరణకు వచ్చే ఏడాది భారత జిడిపి వృద్ధి రేటు 6.4 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. ప్రపంచబ్యాంక్‌ కూడా 6.5 శాతం వృద్ధి రేటు ఉండవచ్చునని చెప్పింది. మన జాతీయ గణాంక వ్యవస్థను ఐఎంఎఫ్‌ ఇటీవల ప్రశ్నిస్తూ జిడిపి డేటా విశ్వసనీయంగా లేనందున ‘సి’ గ్రేడ్‌ ఇచ్చింది.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై
అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై ఆర్థిక సర్వే వ్యాఖ్యానిస్తూ పరిణామాలు అనుకున్న విధంగా సాగడం లేదని వ్యాఖ్యానించింది. అమెరికాతో సులభంగా వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు తప్పాయని తెలిపింది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం విధించిన సుంకాలు మన ఆర్థిక వృద్ధిపై అందరూ భావించిన విధంగా ప్రభావం చూపలేదని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -