ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు ద్రోహం
మాకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
నీటి హక్కుల కోసం మరోపోరాటం : మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపు
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా మారింది పేరు మాత్రమేననీ, ఏపీ జలదోపిడీ ఆగలేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. కాళోజీ ముందే చెప్పినట్టు ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. డిల్లీ కేంద్రంగా తెలంగాణకు జల ద్రోహం జరుగుతున్నదని అన్నారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబుది అయితే పొడిచేది రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ సమావేశం సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం, నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నదని విమర్శించారు. పేరుకు జలవివాదాల సమావేశం కానీ 200 టీఎంసీల నీటిని గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇది అని అన్నారు. నల్లమల సాగర్‌కు డీపీఆర్‌ను ఆపాలనీ, కేంద్రం అనుమతులను ఆపాలనీ, ప్రీ ఫీజబులిటీ నివేదికను ఆపినట్టు ఏపీ హామీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టిందన్నారు. ఈ షరతులకు కేంద్రం హామి ఇచ్చిందా? ఏపీ హామీ ఇచ్చిందా?అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టు లను అడుగడుగునా వ్యతిరేకించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను సమావేశానికి పంపడమంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే కాదా?అని అడిగారు.
చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగా ణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని సమాజం క్షమించబోదని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడ తామనీ, తెలంగాణ నీటి హక్కుల కోసం మరో పోరాటం చేస్తామని అన్నారు. తాము తెలంగాణకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తే రేవంత్ ఏపీకి నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.



