Sunday, February 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్వర్గంలో గాంధీ

స్వర్గంలో గాంధీ

- Advertisement -

అది స్వర్గలోకం. దేవేంద్రుడు, బృహస్పతిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. దేవేంద్రుడికి అనుమానం గానే ఉంది, ఆయన ఒప్పుకుంటాడో లేదోనని. అందుకే దేవ గురువును కూడా తీసుకుని వెళుతున్నాడు. ఒక మందిరం ముందు ఆగాడు. లోపలికి వెళ్లటానికి సంశయిస్తున్నాడు. బృహస్పతి ధైర్యం చెప్పటంతో ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు! ఆ మందిరంలో మహత్మాగాంధీ రామ నామ జపం చేసుకుంటున్నారు!

”మహాత్ముడికి వందనాలు!” అన్నారు ఇంద్రుడు, బృహస్పతి.
”నమస్కారములు! ఏమిటిది ఇంద్రా, బృహస్పతుల వారిని కూడా వెంటపెట్టుకుని వచ్చావు!” అన్నారు గాంధీజీ బోసినవ్వుతో.
”మన స్వర్గంలో రేపు ఒక ప్రత్యేక సమావేశము జరుగుతున్నది. ఆ సమావేశములో పాల్గొనవలసిందిగా ఆహ్వానించుటకు వచ్చితిమి!” అన్నాడు ఇంద్రుడు.

”మామూలు సభల్లోనే రంభా, ఊర్వశి లాంటి వారి గానాభాజనాలు ఉంటాయి! ప్రత్యేక సమావేశం అంటే ఇంకేం ఉంటుందో! నేను రాను!” అన్నారు గాంధీజీ నిర్మొహమాటంగా.
”ఎంతమాట మహాత్మా! మీలాంటి మహోన్నతవ్యక్తిని ఆహ్వానించి గానా బజానాలు ఏర్పాటు చేస్తామా? లేదు లేదు! రేపటి సమావేశానికి త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా వస్తున్నారు!” అన్నాడు బృహస్పతి. దాంతో అంగీకరించారు గాంధీజీ.
ఉత్సాహంగా వెళ్లిపోయారు ఇంద్రుడు, బృహస్పతి.
సమావేశానికి అవసరమైన ఏర్పాట్లు ఘనంగా చేశారు!

మామూలుగానే స్వర్గలోకం ఎంతో బ్రహ్మాండంగా ఉంది! మరి త్రిమూర్తులు కూడా వస్తుంటే మామూలుగా ఉంటుందా? అత్యద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేశారు!
సభకు అప్టదిక్పాలకులు, నవగ్రహాలు, అశ్వనీ దేవతలతో సహ ముక్కోటి దేవతలు విచ్చేశారు! త్రిమూర్తులు, ముగ్గురు దేవేరులతో సహా విచ్చేశారు! సభ ప్రారంభానికి అంతా సిద్ధం! ఇంద్రుడు ఐరావతం రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఐరావతం రానే వచ్చింది! గాంధీజీ కోసం పంపిన ఐరావతం ఖాళీగా వచ్చింది!
”గాంధీజీ ఏనుగును ఎక్కనని, తన శిష్యులైన పటేల్‌, నెహ్రూలతో కలిసి వస్తానని చెప్పారు!” వివరించింది ఐరావతం.
”వారి ముగ్గురి కోసం విజయరథాన్ని మావలితో సహ పంపి ఉండవలసింది!”అనుకున్నాడు ఇంద్రుడు.
ఇంతలో పటేల్‌, నెహ్రూ భుజాలపై చేతులు వేసి నడుచుకుంటూ గాంధీజీ విచ్చేశారు! వారికి కేటాయించిన ఆసనాలలో ఆసీనులయ్యారు!
సభ ప్రారంభమయ్యింది! అధ్యక్షత వహిస్తున్న ఇంద్రుడే ప్రసంగం ప్రారంభించాడు!

”త్రిమూర్తులారా, సమస్త దేవతలారా! ఈ రోజు స్వర్గానికెంతో శుభదినం! స్వర్గం యొక్క ఔన్నత్యం పెరిగిన రోజు! అండ, పిండ, బ్రహ్మండమైన ఈ సృష్టిలో స్వర్గాన్ని మహోన్నతంగా, పుణ్యులకు మజిలీగా సృష్టి కర్త ఏర్పరచారు! అలాంటి మహోన్నత స్వర్గం కూడా ఇంకా తన విలువను పెంచుకున్న రోజు! ఈ రోజుకి ఎందుకంత విలువ వచ్చిందంటే, మన భారతదేశ స్వాతంత్య్ర పోరాట యోధులలో అగ్రగణ్యుడైన మహాత్ముడు మన స్వర్గానికి అరుదెంచిన రోజు ఇదే! సత్యానికి మారుపేరు మహాత్మాగాంధీజీ! ఆయన స్వర్గానికి విచ్చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని భావించి, త్రిమూర్తులు అనుమతి కోరాను. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనటంలో కన్నా మరొక పుణ్యకార్యం లేనే లేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులను అభినందించటం తమ బాధ్యత అనీ, ఈ సభకు తాము కూడా వస్తామని, తెలిపి జగ న్మాతలతో సహా విచ్చేశారు! స్వాతంత్య్ర యోధులకు త్రిమూర్తులు జగన్మాతలు ఇస్తున్న గౌరవాన్ని సమస్త లోకాలు గుర్తించుగాక! ఇప్పుడు సృష్టికర్తయైన బ్రహ్మదేవుల వారిని ప్రసంగించాలని కోరుతున్నాను” అన్నాడు ఇంద్రుడు.

”సమస్త దేవతలారా! ఆ ఆదిపరాశక్తి ఆదేశం మేరకు నేను ఈ సృష్టికార్యం నిర్వహించుతున్నాను. నేను నిమిత్త మాత్రుడిని. సృష్టించడం వరకే నా బాధ్యత. కలియుగంలో ప్రతిజీవి తన క్రియల ద్వారానే కర్మ రూపొందించబడుతుంది! అందువల్ల ఆ జీవి చేసే పాప పుణ్యాలకు కలియుగంలో తానే కర్త అవుతుంది! దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనటం మహోన్నతమైన క్రియ! ఇంతకన్నా పుణ్యకార్యం మరొకటి లేదు. అంతే కాదు!ఇంతటి పుణ్యకార్యమును అనితర సాధ్యమైన సత్యనిష్టతో నిర్వహించిన గాంధీజీ నిజంగా మహాత్ముడే!” అంటూ ముగించాడు బ్రహ్మ.
”ఇప్పుడు మహాశివుడిని ప్రసంగించాలని కోరుతున్నాను” అన్నాడు ఇంద్రుడు.

”ఇలాంటి సభలు, సమావేశాలు నాకు పెద్దగా నచ్చవు. ఇలాంటి వాటికి మహావిష్ణువే తగినవాడు! ఐతే గాంధీజీ గురించి ఏర్పాటుచేసిన సభ కాబట్టి నేను వచ్చాను! కలియుగంలో స్వాతంత్య్ర పోరాటం అత్యంత పుణ్య కార్యమన్నది సత్యం! అనేకసార్లు స్వర్గాన్ని రాక్షసులు ఆక్రమించి, దేవతలను తరిమివేసినపుడు, రాక్షసుల వలన పాలనకు వ్యతిరేకంగా దేవతలు చేసింది స్వతంత్ర పోరాటమేకదా! దేవతలు ఆ స్వతంత్ర పోరాటంలో ఓడిపోయినపుడు మహావిష్ణువు నేనూ ఆ స్వతంత్ర పోరాటంలో దేవతల పక్షాన పోరాడాము కదా! భారత దేశంలో కూడా బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా, గాంధీ, నెహ్రూ, పటేల్‌, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి ఎందరో యోధులు అనేక రూపాల్లో పోరాడారు. బ్రిటిష్‌ వలస పాలకుల నుండి భారతమ్మను విముక్తి చేశారు! దేవతలు చేసిన ప్రతి స్వతంత్ర పోరాటంలో, మహావిష్ణువు, నేనూ ఉన్నాము! మేమిద్దరం లేకుండా దేవతలు ఏ స్వతంత్ర పోరాటంలో విజయం సాధించలేదు! మరి భారత స్వాతంత్య్ర సమరయోధులు మా ఇద్దరి అండదండలు లేకుండానే రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఓడించారంటే, అది ఎంతటి మహత్తర విజయమో మీరంతా గుర్తించాలి! ఎవరు అంగీకరించకపోయినా మహాత్ముడిగా పేరుగాంచిన గాంధీజీ ఈ పోరాటంలో కీలకపాత్రధారి! అందుకే ఆయనకు ఈ గౌరవం డక్కటం సముచితం!” అన్నాడు మహాశివుడు.

అందరూ హర్షధ్వానాలు చేస్తుండగా ”ఢాం ఢాం” అంటూ పిస్టల్‌ శబ్దం విన్పించింది!
సూర్యచంద్రుల మధ్య కూర్చున్న నాధూరాం గాడ్సే పిస్తోలుతో గాంధీని కాలుస్తున్నాడు! కాని గాంధీకి బుల్లెట్లు తగలటం లేదు!
దేవేంద్రుడికి ఇది ఆగ్రహం కలిగించింది!
”గాడ్సే నరకంలో శిక్షలు అనుభవిస్తున్నాడు కదా! వాడిని స్వర్గలోకంలోకి ఎవరు అనుమతించారు! సూర్యచంద్రులారా! మీఇద్దరి మధ్యా వాడు కూర్చుంటే మాకు తెలపకూడదా? వాడిని చూడలేని గుడ్డివారయ్యారా? అంటూ మండిపడ్డాడు ఇంద్రుడు.
”ఈ గాడ్సేను ఇప్పుడే శిక్షిస్తాను!” అంటూ ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని అందుకున్నాడు!
గాడ్సేకి భయమేసింది. తనని మొదటినుండి ప్రోత్సహిస్తున్న తన గురువును సావర్కర్‌ కోసం చూశాడు! ఆశ్చర్యంగా సావర్కర్‌ ఎప్పుడే తప్పించుకుని పోయాడు! లాభం లేదు తనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.
”గాంధీని నేను ఎందుకు చంపాలని అనుకున్నానంటే….”అంటూ గాడ్సే ఏదో చెప్పబోయాడు.
ఈ దృశ్యం చూసిన శివుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు!

”పాపాత్ముడా! ఇది స్వతంత్ర భారతదేశం అనుకున్నావా నీ వాదనలు విన్పించటానికి! భూలోకంలో చేసిన పాపాన్ని స్వర్గంలో కూడా పునరావృతం చేయచూచితివా? స్వాతంత్య్రపోరాటం ఎంతటి పుణ్యకార్యమో త్రిమూర్తుల నోటిద్వారా విన్నా నీకు అర్థం కాదా! స్వతంత్ర పోరాటంలో పాల్గొనని నీవు, దానికి నాయకత్వం వహించిన మహాత్ముడిని కాల్చి చంపటం ద్వారా ఘోరమైన పాపానికి ఒడిగట్టావు. దానికి నరకంలో ఇప్పటికే శిక్షలు అనుభవిస్తున్నావు! అలనాడు క్షీరసాగర మధనంలో రాహుకేతువులు సూర్యచంద్రులను మోసగించినట్లు ఈనాడు నీవు, నీ గురువు ఇద్దరూ సూర్యచంద్రులను మోసగించి, మరోసారి గాంధీజీ హత్యకు స్వర్గంలో కూడా కుట్ర చేసితిరి! అంతేకాక ఆ కుట్రను సమర్ధించుతూ ఇక్కడ వాదించుటకు సైతం సిద్ధపడుతున్నావు! నీలాంటి వారిని సహించటం కూడా తప్పిదమవుతుంది!” అంటూ మహాశివుడు మూడోకన్ను తెరిచి నాధూరాం గాడ్సేను భస్మం చేశాడు.

  • ఉషాకిరణ్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -