నివాళి
ప్రముఖ రచయిత, విశ్లేషకుడు, ఆచార్య చందు సుబ్బారావు (80) అనారోగ్యంతో గురువారం విశాఖలో మృతి చెందారు. ఆయనకు భార్య నిర్మలాదేవి, కుమారుడు దిలీప్, కుమార్తె కవిత ఉన్నారు. చందు సుబ్బారావు ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో 1946 మే 18న జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో 1974లో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, రీడర్‌గా, జియో ఫిజిక్స్ విభాగంలో ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 1979-1982 మధ్య అరసం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాహిత్యంలో తనదైన శైలిలో అనేక రచనలు చేశారు. సైన్స్ అండ్ సివిలైజేషన్, ‘కవికి విమర్శకుడు శత్రువు కాదు’… వంటి రచనలు ప్రాచుర్యం పొందాయి. శ్రీశ్రీపై ఆయన చేసిన రచనలు హిందీలోకి అనువదించారు.
మార్క్సిస్టు రచయితగా, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగా వ్యవహరించిన సుబ్బారావు స్త్రీవాద, రాజకీయ, శాస్త్రీయ అంశాలపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. ఇటీవల నాలుగు విమర్శక గ్రంథాలను ఒకే పుస్తకంగా వెలువరించారు. 1966లో తాపీ ధర్మారావు అవార్డు, 1999లో కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నారు. అధికార భాషా సంఘం సభ్యునిగా పనిచేశారు. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ఒక కోర్సుగా పెట్టాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చందు సుబ్బారావు మృతిపట్ల సాహితీస్రవంతి, తెలంగాణ సాహితి సంతాపం ప్రకటించాయి.
అభ్యుదయ సాహితీవేత్త చందు సుబ్బారావు
- Advertisement -
- Advertisement -



