పంట కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..
రాష్ట్రంలో బీజేపీ నేతల ‘భరోసా’ యాత్రలు
ఫలితంగా కల్లాలు, మార్కెట్ యార్డుల్లోనే పంటలు
కేంద్రమంత్రుల మౌనం
చోద్యం చూస్తున్న బీజేపీ ఎంపీలు
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే… అంటే ఇదే. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సవాలక్ష కోర్రీలు విధిస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరుతో యాత్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనమని నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన బీజేపీ నేతలు ఆ తప్పును రాష్ర్ట ప్రభుత్వంపైకి నెడుతూ రాజకీయం చేస్తున్నారు. రాష్ర్టం నుంచి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు కూడా కేంద్రంలో మోడీ సర్కార్‌ను నిలదీసే పరిస్థితులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే…మొదట కేంద్రం సమస్యను సృష్టిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర పార్టీతో ఆందోళనలు చేయిస్తుంది. రాష్ర్ట ప్రభుత్వాన్ని బదనాం చేశామని సంతృప్తి చెందాక, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి, సమస్యను పరిష్కరించినట్టు ప్రకటనలు చేస్తారు. గడచిన పదేండ్లుగా ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం చేస్తున్న రాజకీయం ఇదే. ధాన్యం కోతలు ప్రారంభమైనప్పటి నుంచి సీపీఐ(ఎం), ఇతర వామపక్షపార్టీలు, బీఆర్‌ఎస్ నేతలు కల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డుల్లో పర్యటించి వచ్చారు. ఇక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందున తాము కూడా రాష్ట్ర రైతుల పక్షాన ఉన్నామని చెప్పుకొనేందుకు బీజేపీ నేతలు తాజాగా యాత్రలు మొదలు పెట్టారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధాన్యం, మక్క, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్ల పర్వంలో అన్నదాతలు సమిధలవు తున్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోళ్లలో కేంద్రం నియంత్రణ విధించడంతో రైతు ఆగమవుతున్నాడు. ఫలితంగా మార్కెట్‌లో మద్దతు ధరలు దక్కట్లేదు. దీనికి మోడీ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చకున్న వాణిజ్య ఒప్పందాలే కారణంగా కనిపిస్తున్నాయి. మొన్న పత్తి పంట రేటు పడిపోవ డానికి…ఇవ్వాళ మొక్కజొన్న పంట కొనుగోళ్ల జాప్యానికి…నూనె గింజలు, ఆయిల్‌ఫామ్ పంటల రేట్లు పడిపోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుంకాలను ఎత్తేయడమే కారణం. తెలంగాణలో పండిన పంటల్లో కనీసం 75 శాతం కొనుగోలు చేయాలనే రాష్ట్ర మంత్రి తుమ్మల విజ్ఞప్తులు, లేఖలను పక్కనే పడేసిన కేంద్రం 25 నుంచి 35 శాతాలకు మించి పంటలను కొనొద్దని మొలికలు పెట్టింది. ఇక్కడ కొనుగోళ్లలో రాష్ట్ర సర్కారు వైఫల్యం, కొనుగోళ్లకు అనుమతివ్వడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కలగలిసి అన్నదాతలు ఆగమవుతున్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 65,42,155 ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి వరి ధాన్యం దిగుబడి కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 53.43 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని మెలిక పెట్టి కూర్చున్నది.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తోందనీ, రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకూ పదేపదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో రైతుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల పంటను మద్దతు ధర +బోనస్ ఇచ్చి సేకరించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పడు 75 లక్షల మెట్రిక్ టన్నులే సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 40 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నట్టు తెలుస్తోంది. మిగతా పంట అంతా మార్కెట్ యార్డుల్లోనే ఎండకు ఎండుతూ..వానకు తడుతూ.. రైతుల కంట కన్నీరు పెట్టిస్తూ ఉంది. అంటే సగం పంటను రైతులు ప్రయివేటులో అమ్ముకునేలా పాలకులే చేస్తున్నారు. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలో 16,36,730 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఎకరాకు 26.5 క్వింటాళ్లే కొనాలనే కేంద్రం షరతు రైతులకు నష్టదాయకంగా మారింది. ఒక్కో రైతు 10 నుంచి 15 క్వింటాళ్లను ప్రయివేటు మార్కెట్‌లో రూ.1800 చొప్పున అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్రం ప్రకటించిన ఎమ్‌ఎస్‌పీ రూ.2,400 ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 13 లక్షల మ్రెటిక్ టన్నులకుపైగా మక్కలను రాష్ట్ర సర్కారు క్వింటాకు రూ.2,400 చొప్పున సేకరించింది. కేంద్ర ప్రభుత్వం సహకారం కొరవడటంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.4, 172.94 కోట్ల నిధులను మక్కల కొనుగోళ్లకు వెచ్చించింది. మార్కెట్లకు మక్క పంట పోటెత్తుండటంతో మరో రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే, పంటల దిగుబడి ఎక్కువ రావడం, వాటిని నిల్వ చేసేందుకు సరైన గోదాములు లేకపోవడం, లారీల కొరత వంటి సమస్యలతో మక్కల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఎక్కువ సంఖ్యలో పంట దిగుబడి వచ్చింది కాబట్టి పీఎస్‌ఎస్ పథకంలో భాగంగా కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా 14.90 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను, 2.1 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న పంటల కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర సర్కారు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా బీజేపీ నేతలు రైతుల దగ్గరకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదనీ, మక్కలను కొనట్లేదని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో జొన్న పంట సాగైంది. 4.03 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడి వస్తుందని అంచనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అన్నదాతలు నష్టపోకుండా జొన్నలను కొనుగోలు చేసేందుకు రూ.1100 కోట్లను వెచ్చించింది. తెలంగాణలో 3,690 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు(25 శాతమే)ను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, రైతులకు నష్టం చేకూర్చకూడదని 15,262 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. దాన్ని కేంద్ర సర్కారు బుట్టదాఖలు చేసింది. పత్తి పంట విషయంలోనూ ఇదే జరిగింది. కిసాన్ కపాస్ యాప్ ద్వారా ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొంటామని కేంద్ర ప్రభుత్వం షరతులు విధించిన విషయం విదితమే. అదే సమయంలో పత్తి, పామాయిల్, ఆయిల్ పంటల దిగుమతులపై సుంకాలు ఎత్తివేయడంతో అమెరికా నుంచి పత్తి బేళ్లు, పామాయిల్ దిగుమతులు పెద్ద ఎత్తున జరిగి మన దేశ మార్కెట్‌లో వాటి ధరలు పతనం అయిన విషయం విదితమే. రాష్ర్టంలో బీజేపీ రెండు నాల్కల ధోరణే ఇప్పుడు రైతాంగంలో చర్చగా మారింది.



