పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి
ఎన్నికలు ముగియగానే వడ్డింపు మొదలు..:సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతిరిక్షాలు తొక్కుతూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిరసనమిర్యాలగూడలో ఆటోకు తాళ్లు కట్టి..
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధరలను పెంచబోమన్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగియగానే సామా న్యుడిపై భారాల మోత మోగిం చిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. కొద్ది రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు పార్టీ శ్రేణులు రిక్షాలు తొక్కుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. పెట్రోల్‌పై రూ.7.5, డీజిల్‌పై రూ.7.6 చొప్పున పెంచడం దారుణమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ధరలు పెంచడం వెనుక బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలే కారణమని విమర్శిం చారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడి వంటింటిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం, ఉప్పు, పప్పు, నూనెలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మోడీ సర్కారు అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తూ దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్ వంటి దేశాలు తక్కువ ధరకే చమురు ఇస్తామన్నా.. అమెరికా భయంతో కొనుగోలు చేయకుండా ప్రజలపై భారం వేస్తోందన్నారు.
కార్పొరేట్లకు మేలు..
చమురు కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్త లకు లాభం చేకూర్చేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటోందని సీపీఐ(ఎం) సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ విమర్శించారు. దేశం కోసం భారం మోయాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. అప్పుల్లో ఉన్న రైతులు, సామాన్యులను ఆదుకోవాల్సింది పోయి, వారిపై పెట్రో భారం వేయడం ‘పుండు మీద కారం చల్లినట్టు’ ఉందని అన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.మహేందర్, ఎం.దశరథ్, నగర కమిటీ సభ్యులు జె.కుమారస్వామి, ఎన్.మారయ్య, వై.వరలక్ష్మి, కె.అజయ్ బాబు, జి.నరేష్, జి.కిరణ్, ఎం. అజయ్ బాబు, కె.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆటోకు తాళ్లు కట్టి..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు బైక్‌లను నెట్టుకుంటూ నిరసన తెలిపారు. మిర్యాలగూడలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాగర్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆటోకు తాళ్లు కట్టి లాక్కెళ్లారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.



