ఉపాధి హామీ చట్టానికి పేరేందుకు తొలగించారు
బ్రిటీష్ పాలకులే ఆయన్ను ముట్టుకోలేదు
మతతత్వ శక్తులు కాల్చి చంపాయి : చెన్నై బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా గాంధీ ఏం పాపం చేశారనీ, ఉపాధి హామీ చట్టానికి ఆయన పేరును ఎందుకు తొలగించారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసి దాన్ని కనిపించకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న ఊరిలోనే సంపాదిస్తూ ఆత్మగౌరవంతో వ్యవసాయ కూలీలు జీవించేందుకు ఉపాధి హామీ చట్టం తోడ్పడిందని వివరించారు. ఇంతటి గొప్ప చట్టాన్ని కనుమరుగు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక మార్పులు తెచ్చిందన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం-2005ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఉపాధి చట్టంతో వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఇబ్బందులు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బలమైన బ్రిటీష్ పాలకులు గాంధీజీని ముట్టుకునే సాహసం కూడా చేయలేకపోయారని అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన ఆర్నెల్లలోనే మత శక్తులు మహాత్మా గాంధీని పట్టపగలు తుపాకీ గుళ్లతో కాల్చి చంపాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వ, ఏఐసీసీ కార్యదర్శి చోలాంకర్‌జీ తదితరులు పాల్గొన్నారు.



