Monday, June 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబడుగుల భూములే టార్గెట్

బడుగుల భూములే టార్గెట్

- Advertisement -

ఇండస్ట్రియల్‌ కారిడార్ భూ సేకరణలో రైతుల గోస
అధికార పార్టీ అనుచరుల భూములను ముట్టుకోని వైనం
1,197 ఎకరాలు దళితులు, బీసీల భూములే
రూ.వెయ్యి కోట్ల విలువ చేసే భూములపై కన్ను

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
బడుగుల భూములే టార్గెట్ గా భూ సేకరణ తంతు సాగుతోంది. అధికార పార్టీ అనుచరుల భూములు మాత్రం సేప్‌‌గా ఉండేలా చూసుకుంటున్నారు. వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి పనుల కోసం దళితులు, బీసీ కుటుంబాల భూములపైనే ప్రభుత్వం కన్నేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు వారిపైనే సవారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ వర్గాన్ని కాపాడుకోవడానికి బలహీన వర్గాలను తొక్కిపెట్టేందుకు సైతం వెనకాడటం లేదు. ఇందుకు నిదర్శనమే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణ. బలహీన వర్గాల భూముల్ని టార్గెట్ చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలలోని కాండ్లపూర్, రాపోలు గ్రామల్లో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. కాండ్లపూర్ రెవెన్యూ పరిధిలో 587 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 159 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూములపై 350 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నా యి.

రాపోలు గ్రామంలో 509 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 101 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూములపై మరో 300 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇందులో అద్దెకరం నుంచి ఐదు ఎకరాలు భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులే రెండు గ్రామాల పరిధిలో సుమారు 4 వేల మంది ఉన్నారు. భూ సేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే.. స్థానికంగా ప్రజాప్రతినిధులు తమ వర్గానికి చెందిన కొంత మంది భూములను కాపాడటమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలను టార్గెట్ చేస్తూ భూసేకరణ చేపడుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాండ్లపూర్, రాపోలు గ్రామాల్లో బలహీన వర్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామాలనే టార్గెట్‌గా చేసుకుని భూములు లాక్కుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రెండు గ్రామాలకు ఇరువైపులా ఉన్న నర్సాయిగూడ, కుధావన్‌పూర్ గ్రామాల్లో వందల ఎకరాలు ఉన్న భూ స్వాములున్నారు. ఈ గ్రామాల భూములు కూడా భూ సేకరణ చేపడుతున్న రెవెన్యూలో ఉన్నప్పటికీ ఆ భూములను తప్పించుకుంటూ భూ సేకరణ మ్యాప్ గీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

బలహీన వర్గాల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. తమ భూములు లాక్కుంటే వారి పక్షాన అడిగే దిక్కులేదని.. ప్రభుత్వంలో పెద్దలు కొందరు కుట్ర పూరితంగా భూ సేకరణ చేపడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వర్గాలకు బంగారం లాంటి భూములను కట్టపెట్టేందుకు ప్రజాప్రతినిధులు పేదల భూములపై కన్నెసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు దగ్గరలోనే గ్రీన్ ఫిల్డ్ రోడ్డు నిర్మాణం కాబోతుండటంతో.. ఈ ప్రాంతంలోని పేదల భూములను సేకరించి బడాపెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
పరిగి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, సాగుకు ఉపయోగంలో లేని బంజరు భూములు వేలాది ఎకరాలున్నాయి. కనీసం ఆ భూములనైనా కంపెనీల కోసం తీసుకోవడం లేదు. కానీ మక్కలు, పల్లి, కందులు, మినుములు, జొన్నలు, సజ్జలు, పత్తి, వరి పంటలు, పండ్ల తోటలు మామిడి ఎక్కువగా సాగు చేసే కాండ్లపూర్, రాపోల్ గ్రామాల భూములను తీసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భూసేకరణలో బహుజనులే టార్గెట్
మా భూముల పక్కనున్న అగ్రవర్ణాల భూములను తాకకుండా.. వారి భూములను రక్షించేందుకు ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు. భూ సేకరణలో బలయ్యేది బహుజన వర్గాలు మాత్రమే. మాకు రాజకీయ అండదండలు లేకపోవొచ్చు. కానీ మా భూములు ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు.. గజం భూమిని కూడా వదిలేది లేదు.
పూలేందర్, సర్పంచ్ కాండ్లపూర్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -