గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
రెండోసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్
నవతెలంగాణ హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ (32; 16 బంతుల్లో) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో వీరిద్దరూ కేవలం 4.3 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి కాస్త తడబడినప్పటికీ, ఒకవైపు విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. టిమ్ డేవిడ్ (24) కీలక సమయంలో రాణించాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన కోహ్లీ, 18వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇంకా 12 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్; 37 బంతుల్లో) ఒంటరి పోరాటం చేసి అర్ధశతకంతో ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో సత్తా చాటగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో ఆర్సీబీ, ఆ జట్టు కెప్టెన్ రజత్ పటీదార్ అరుదైన ఘనత సొంతం చేసుకోవడం విశేషం. ఆర్సీబీ ఈ విజయంతో… వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. కెప్టెన్ గానూ రజత్ పటీదార్ వరుసగా రెండు టైటిళ్లతో రికార్డు పుటల్లోకెక్కాడు.


