Saturday, February 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటెక్సాస్‌లో భారతీయులపై వివక్ష

టెక్సాస్‌లో భారతీయులపై వివక్ష

- Advertisement -

హెచ్‌-1బీ వీసాదారులు నగరాన్ని ఆక్రమించారంటూ ఆగ్రహం

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో జరిగిన ఓ సమావేశంలో అక్కడి భారతీయులు వివక్షకు గురైనట్టు తెలుస్తోంది. హెచ్‌-1బీ వీసాదారులు తమ నగరాన్ని ఆక్రమించారంటూ ఫ్రిస్కో నగరంలోని కౌన్సిల్‌ సమావేశంలో అక్కడి సంప్రదాయ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అయితే, ఈ సమావేశానికి హాజరైన భారతీయులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం.. ఫ్రిస్కో నగరంలో భారతీయుల సంఖ్య పెరిగిపోవడంపై కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడేందుకు రావాలని సోషల్‌ మీడియా కన్జర్వేటివ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు కైలీ కాంబెల్‌, మార్క్‌ పలాసియానోలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొందరు వ్యక్తులు యూఎస్‌కు మద్దతుగా ఉండే టోపీలు, మాస్క్‌లతో పాల్గొన్నారు. వారు హెచ్‌-1బీ వీసాకు, ఇక్కడి భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ పలాసియానో మాట్లాడుతూ.. ఇక్కడ భారతీయుల జనాభా పెరగడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇక్కడ వీసాల జారీలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

త్వరలో ఈ ప్రాంతం మొత్తం భారతీయులతో నిండిపోతుందని.. ఇప్పటికైనా అమెరికన్లు మేలుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలను లాక్కొనే వీసా విధానానికి తాను, తన మద్దతుదారులు ఎప్పటికీ వ్యతిరేకమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వివక్షపూరిత వ్యాఖ్యలను సమావేశంలో పాల్గొన్న అనేకమంది ఇండో- అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. హెచ్‌-1బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలను తాము వ్యతిరేకిస్తామని.. అయితే, ఇందుకు ఇక్కడి భారతీయులపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. తాము ఇక్కడ జీవించడం వల్ల ఈ ప్రాంతానికి కూడా ప్రయోజనకరమని స్పష్టం చేశారు. నగరంలో నివసించే భారతీయులకు ఫ్రిస్కో మేయర్‌ జెఫ్‌ చెనీ మద్దతుగా నిలిచారు. కాగా, ఫ్రిస్కోలో భారతీయ మూలాలున్న జనాభా అధికం. ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం.. 2010లో 10 శాతంగా ఉన్న వీరి సంఖ్య ఇప్పుడు 33 శాతానికి పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -