ఆమె లైంగికదాడి కేసు పెట్టలేదు : సుప్రీంకోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఒక వివాహిత మరో వ్యక్తితో ఒక అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకొని, ఆ తర్వాత సంబంధం చెడిపోయినప్పుడు పెండ్లి చేసుకుంటానన్న వాగ్దానంతోనే అలా చేశానంటూ సదరు వ్యక్తిపై లైంగికదాడి కేసు పెట్టలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ మహిళా న్యాయవాది పెట్టిన లైంగికదాడి కేసుపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో మహిళ ఇప్పటికే పెండ్లి అయి ఉండడంతో ఆమెకు చట్టపరంగా మరో పెండ్లి చేసుకునే అర్హత లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
అలాంటి పరిస్థితిలో ‘పెండ్లి హామీ’ అనేది చట్టబద్ధంగా అమలు చేయగల హామీ కాదని వివరించింది. ”ఇది అంగీకారంతో జరిగిన సంబంధం. తర్వాత వ్యక్తిగత విభేదాలతో అది విరోధంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో లైంగికదాడి కేసు పెట్టడం క్రిమినల్ చట్టాల దుర్వినియోగం అవుతుంది” అని కోర్టు తెలిపింది. అలాగే హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం భర్త లేదా భార్య జీవించి ఉండగా మరో పెండ్లి నిషేధం. కాబట్టి ‘పెండ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు’ అనే వాదన ఇక్కడ నిలబడదని కోర్టు తేల్చింది. ఈ మేరకు ఓ మహిళా న్యాయవాది.. లాయర్‌పై పెట్టిన లైంగికదాడి కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. నిజమైన లైంగికదాడి కేసులు, అంగీకారంతో జరిగిన సంబంధాల తర్వాత వచ్చే తగాదాలను వేరు చేసి చూడాలనీ, న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది.



