కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఏఐ జాక్టో వినతి
స్పష్టమైన హామీ ఇవ్వని కేంద్ర మంత్రి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఏఐ జాక్టో స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎన్ భార్తి, చావ రవి, కత్తి నరసింహారెడ్డి, బసవరాజ్ గురికార్, కమలాకాంత త్రిపాఠి, సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు వి శివదాసన్ కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యాహక్కు చట్టం అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులంతా రెండేండ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలని, లేదా ఉద్యోగాల నుంచి తొలగించాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశవ్యాప్తంగా 30లక్షల మంది ఉపాధ్యాయులు ప్రభావితం అవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సత్వరమే జోక్యం చేసుకుని, అవసరమైతే చట్ట సవరణ చేసైనా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా టెట్ సిలబస్, అర్హత మార్కుల విషయంలో సడలింపు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు రెండు, మూడు సందర్భాల్లో ఉపాధ్యాయులందరూ టెట్ పాస్ కావాలని తీర్పు ఇచ్చిందని, దానిని ఎలా అధిగమించాలో న్యాయ నిపుణులతో ఆలోచన చేస్తున్నామని అన్నారు. దీనికి నేతలు బదులిస్తూ ఇప్పటికే ఆరు నెలలు గడిచాయని, ఉపాధ్యాయులంతా మానసికంగా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారని, జాప్యం లేకుండా నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయులకు ఊరట కలిగించాలని మంత్రిని కోరారు. అదే విధంగా సీపీఎస్ రద్దు, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఓటు హక్కు, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు, జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ విద్యకు నష్టం కలిగించే అంశాల రద్దు తదితర సమస్యలను ప్రస్తావించగా అవన్నీ ప్రభుత్వ విధానపరమైన అంశాలంటూ దాటవేయడం పట్ల ఐక్య వేదిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేను కలిసి టెట్ సమస్యను వివరించి.. పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని ఏఐ జాక్టో నాయకులు తెలిపారు.
సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -



