నవతెలంగాణ – బోనకల్
బతుకుదెరువు కోసం హమాలీ పనులకు వెళ్లి తిరిగి తన టీవీఎస్ పై ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ హమాలీ మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన బోనకల్ గ్రామానికి చెందిన తోటపల్లి వెంకటేశ్వర్లు (65) ప్రతిరోజు లాగే బుధవారం కూడా బోనకల్ సమీపంలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీ పనులకు వెళ్లాడు. పనులు అనంతరం తిరిగి తన టీవీఎస్ ఎక్సెల్ పై ఇంటికి బయలుదేరాడు. వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిలోనే బి బి సి బ్రిడ్జి సమీపంలోనే రెస్టారెంట్ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రం నుంచి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో బోనకల్లు వైపు నుంచి కారు వస్తూ కారు ప్రమాదం నుంచి తోటపల్లి వెంకటేశ్వర్లు బయటపడ్డాడు.
అయితే అదే సమయంలో ఎదురుగా రెండు మోటార్ సైకిల్ వస్తుండగా ముందుగా వస్తున్న స్కూటీ తోటపల్లి వెంకటేశ్వర్లు టీవీఎస్ ఎక్సెల్ ను ఢీ కొట్టింది. దీంతో తోటపల్లి వెంకటేశ్వర్లు రోడ్డుపై పడిపోగా ఆ వెంటనే వెనుక వస్తున్న మరో మోటార్ సైకిల్ రోడ్డుపై పడి ఉన్న తోటపల్లి వెంకటేశ్వర్లను బలంగా ఢీ కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు పాలయ్యాడు. చెవుల ద్వారా రక్తస్రావం తీవ్రంగా అయింది. దీంతో స్థానికులు సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమతా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య లక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పొదిలి వెంకన్న తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్కూటీ, మోటార్ సైకిల్ పరార్ అయ్యాయి. అయితే వెంకటేశ్వర్లు రైల్వేలో ఉద్యోగం చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వటంతో తన కుమారుడికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. అనంతరం వివిధ రకాల పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.



