భూమి గుండెలోంచి శిరసెత్తిన బంకమట్టి
కుమ్మరి చేతివేళ్ళ లయబద్ద స్పర్శతో
శ్రమ సంగీతమై ప్రతిధ్వనించింది!
కాలచక్రంపై గిరగిరా తిరుగుతూ
సృష్టికర్త వేళ్ళ ఒత్తిడికి పసిపాపలా సుందర రూపమై
ప్రాణం పోసుకుంటోంది.
గ్రామదేవత నవ్వుల సాక్షిగా
నొసట మట్టిబొట్టు పెట్టుకుని
పుడమితల్లి పాడుతోంది మట్టి పాట
ఆ పాట పల్లవిలోంచే ఒక రూపం పురుడుపోసుకుని
వాముసెగల్లో రాటుదేలి దాహం తీర్చే దేవతవుతోంది.
మట్టికుండ అంటే..
పల్లె సంస్కృతికి జీవం, ఆత్మీయతల జ్ఞాపకం
ఆకలి తీర్చిన అమ్మ చేతి గోరుముద్దల పరిమళం!
ప్రతి పాత్రలోనూ తన ఆత్మను నింపుతూ
నిశ్శబ్దంగా సృష్టి యజ్ఞం చేసే ఆ కుమ్మరన్న
ప్రాణంపోసే ఒక నిజమైన విశ్వకళాకారుడు
లోకం ప్లాస్టిక్ మాయాజాలంలో చిక్కుకున్నా
చెరగని చిరునవ్వుతో నిలిచింది ఆయన నమ్మకం
దైవత్వం రాతి విగ్రహాల్లో కాదు
దాహం తీర్చే పాత్రల్లోనే ఉందని చాటుతోంది.
మట్టికి జీవం పోస్తూ..
మన మూలాలకి ఊపిరినిస్తూ..!
-విల్సన్ రావు కొమ్మవరపు, 8985435515
మట్టికుండ
- Advertisement -
- Advertisement -

