నవతెలంగాణ – నవీపేట్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల సమన్వయ కమిటీ సమన్వయకర్త సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అలాగే జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చి చట్టాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
రైతులకు నూతన విద్యుత్ విత్తన చట్టాలను తీసుకువచ్చి తీవ్ర నష్టం వాటిల్లె విధంగా చేస్తూ ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా హక్కులను కాపాడేందుకు అందరూ కదం తొక్కి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్ సింగ్, మండల కన్వీనర్ వసంత్, కెవిపిఎస్ మండల కార్యదర్శి గౌతమ్, సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.



