హెచ్-1బీ వీసా రద్దుకు బిల్లు
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్నిపూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి హెచ్-1బీ వీసా విధానానికి పూర్తిగా స్వస్తి పలకడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా జాతి ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను హరిస్తున్నాయని, అమెరికా పిల్లల కోసం ‘అమెరికన్ డ్రీమ్’ను కాపాడాలంటే ఈ దోపిడీని అరికట్టాలని చెబుతున్నారు. అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారత టెకీల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని నిపుణులు పేర్కోంటున్నారు.
హెచ్-1బీ వీసా పొందుతున్న వారిలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే ఉంటున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త వీసాలపై 1,00,000 డాలర్ల భారీ రుసుమును విధించి షాక్ ఇచ్చింది. పైగా లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాలకు తోడు ఈ కొత్త బిల్లు అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఐటీ నిపుణులకు షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



