– పులి దంతాలు, గోర్లు స్వాధీనం
– ఇద్దరి అరెస్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అక్రమ వన్యప్రాణి వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), హైదరాబాద్ జోన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నాంపల్లి ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో రెండు పులి కేనైన్ దంతాలను, ఏడు పులి గోర్లు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు కొనుగోలుదారులుగా నటిస్తూ నిందితులను సంప్రదించారు. నాంపల్లి లోని హోటల్ ఏషియన్ ఇంటర్నేషనల్, గది నెం. 305లో లావాదేవీలు జరగనున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి అవశేషాలు, నిందితులను తదుపరి చర్యల నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. విచారణలో నిందితులు ఈ వన్యప్రాణి అవశేషాలను కేరళ రాష్ట్రానికి చెందిన జకరియా అనే వ్యక్తి నుంచి పొందినట్టు ఒప్పుకున్నారు. అతను ఇద్దరు నిందితులకు సన్నిహిత మిత్రుడని తెలిపారు. జిల్లా అటవీ అధికారి నిందితులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరు పరచగా నిందితులకు 15 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కేరళ అటవీ శాఖకు పంపించారు. వన్యప్రాణి అవశేషాల మూలాన్ని గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
అక్రమ వన్యప్రాణి వ్యాపారం భగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



