నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె-గ్రామీణ బంద్‌కు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడారు. అనేక సంవత్సరాలపాటు పోరాటాలు, రక్తతర్పణాలతో సాధించుకున్న 28 కార్మిక చట్టాలను బీజేపీ 4 లేబర్ కోడ్‌లుగా మారుస్తున్నదని విమర్శించారు. లేబర్ కోడ్‌లు అమలైతే యూనియన్ పెట్టుకునే హక్కు, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల కోసం అడిగే హక్కు, సమ్మె హక్కు కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో పని చేసే మహిళలకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు. నరేగాలో ప్రస్తుతం ఉపాధి పనులు చేస్తున్న వారిలో 80 శాతం నుంచి 85 శాతం వరకు మహిళలే ఉన్నారనీ, అలాంటి చట్టాన్ని తీసేసి వీబీజీరామ్‌జీ తీసుకొస్తున్నారని తెలిపారు. దీంతో మహిళల ఉపాధి దారుణంగా దెబ్బతింటుందని తెలిపారు. వెంటనే మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. కార్డులకు అనుగుణంగా రూ.3 లక్షల కోట్ల నిధులను కేటాయించకుండా 90 వేల కోట్లకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేలా తెస్తున్న నూతన విద్యుత్ బిల్లుతో పాటు నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని కోరారు. బీజేపీ పాలనలో సాధించుకున్న హక్కులన్ని నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ, అన్ని వర్గాల హక్కులపై బీజేపీ దాడి చేస్తున్నదని విమర్శించారు. ఆ హక్కులన్నింటిని రక్షించుకునేందుకు ప్రతి మహిళ సార్వత్రిక సమ్మె-గ్రామీణ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్.ఆశాలత పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె – గ్రామీణ బంద్‌కు మద్దతు : ఐద్వా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



