నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు సుప్రీత్ క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శ్రీహరి అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం, వనస్థలిపురం నుంచి కుందన్‌పల్లికి ట్రిప్ పూర్తి చేసిన డ్రైవర్ శ్రీహరి, నాగారం చౌరస్తా వద్ద రోడ్డు పక్కన కారును నిలిపి తదుపరి బుకింగ్ కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో ఫార్చ్యూనర్ కారులో అటుగా వచ్చిన నటుడు సుప్రీత్ రెడ్డి, వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా ఎందుకు పెట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో తనను అసభ్య పదజాలంతో దూషించి, భౌతికంగా దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని శ్రీహరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే బాధితుడు ‘డయల్ 100’కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీత్‌పై కేసు నమోదు చేశారు.


