నమీబియాతో భారత్ ఢీ నేడు
గాయాలతో సూర్యసేన సతమతం
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-న్యూఢిల్లీ
తొలి మ్యాచ్‌లో తడబడిన డిఫెండింగ్ చాంపియన్ బ్యాటింగ్ లైనప్.. నేడు న్యూఢిల్లీలో ధనాధన్ షోకు సిద్ధమవుతోంది. పరుగుల వేటకు సూర్య సేన సన్నద్ధం అవుతుండగా.. అస్వస్థత భారత శిబిరంలో ఆందోళనకు కారణమైంది. అభిషేక్ శర్మ కడుపులో నొప్పితో బాధపడుతుండగా, బుమ్రా ఇప్పుడిప్పుడే జ్వరం నుంచి కోలుకుంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకుని ఇప్పుడే జట్టుతో చేరాడు. భారత్ ఆటగాళ్లు అస్వస్థతతో ఇబ్బంది పడుతుండటంతో అద్భుతం చేసేందుకు ఇదే సరైన అవకాశమని నమీబియా భావిస్తోంది. గ్రూప్ దశలో వరుసగా రెండో విజయంతో దాయాదితో సమరానికి సై అనేందుకు ఆతిథ్య భారత్ ఎదురుచూస్తోంది. భారత్, నమీబియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్ నేడు.
సంజు శాంసన్‌కు చాన్స్!
అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో తొలి బంతికే నిష్క్రమించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇంకా కోలుకోలేదని సమాచారం. దీంతో సంజు శాంసన్‌కు నేడు ఓపెనర్‌గా అవకాశం దక్కనుంది. కివీస్‌తో ఐదు మ్యాచులు సహా వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన సంజు శాంసన్‌కు మరో అవకాశం లభించనుంది. ఇషాన్ కిషన్ తోడుగా సంజు శాంసన్ నేడు ఓపెనర్‌గా రానున్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్‌లు యుఎస్‌ఏతో మ్యాచ్‌లో తడబాటుకు గురయ్యారు.
నేడు ఫిరోజ్ షా కోట్లలో సిక్సర్ల వర్షం కురిపించేందుకు ఈ త్రయం ఎదురుచూస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. కివీస్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. యుఎస్‌ఏపై ఒంటరి పోరాటం చేశాడు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును గట్టెక్కించాడు. ఆల్‌రౌండర్లు శివం దూబె, అక్షర్ పటేల్ అంచనాలను అందుకోవాల్సి ఉంది. జశ్‌ప్రీత్ బుమ్రా నేడు ఆడితే అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. వరుణ్ చక్రవర్తితో కలిసి అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్ : సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, రింకు సింగ్, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా/సిరాజ్, వరుణ్ చక్రవర్తి.
నమీబియా : స్టీన్‌కాంప్, జాన్, నికోల్ ఈటన్, ఎరాస్మస్ (కెప్టెన్), స్మిట్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), లీచర్, విలియం, రూబెన్, బెర్నార్డ్, బెన్ షికాంగో.



