నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. మోహన్ నాయక్ ఇంటితోపాటు.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలు కలిపి.. 11 ఇతర ప్రాంతాల్లో ఏకంగా 16 ఏసీబీ టీంలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామునే తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బు, బంగారం, మద్యం బాటిళ్లు దొరికినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు బయటపడ్డ వివరాల ప్రకారం.. ఆయన ఆస్తులు మొత్తం రూ.100 కోట్లకు పైనే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా.. రూ.60 లక్షల నగదు, 3 కిలోల బంగారం, 35 మద్యం సీసాలు, భారీగా ఆస్తి పత్రాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అందులో 15 బంగారు బిస్కెట్లు కూడా ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయని.. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ నాయక్ అక్రమాస్తులపై 16 ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని వివరించారు. సాయంత్రం వరకు మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.



