నవతెలంగాణ – బిచ్కుంద
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా బుధవారం ముగియడంతో ఓటు రూపంలో అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఓటు వేసిన బ్యాలెట్ బాక్స్ లను అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూములకు తరలించారు.
బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు ఎన్నికలు జరగగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భీఆర్ఎస్, బిజెపి ఇతర పార్టీలతో పాటు ఇండిపెండెంట్ లు ధనం, బలం తదితర అంశాలను అన్ని విధాలుగా ఓటర్లపై ప్రయోగించి ఓట్లు సాధించేందుకు ఓటర్లను ఆకర్షించడానికి నువ్వా నేనా అన్నట్లు జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఓటర్లు మాత్రం చాకచక్యంగా ఓట్లు అడగడానికి వచ్చిన అభ్యర్థులను నిరుత్సాహపరచకుండా ఓటు మీకే వేస్తామని సమాధానం చెబుతూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన భీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండగా రెండు మూడు వార్డుల్లో రెబెల్ గా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలో నిలిచిన వారు ప్రధాన పార్టీల గెలుపోటములకు కీలకంగా మారనున్నారు. ఓటర్లు ఓటు రూపంలో ఎవరికి పట్టం కడతారో శుక్రవారం వరకు వేచి చూడాల్సి ఉంది.



