నవతెలంగాణ – మద్నూర్
ఇటు డోంగ్లి.. అటు పొతంగల్ మండలాల మధ్యలో గల మంజీరా నదిలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక దొంగలను పట్టుకునేందుకు డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా పలు గ్రామాల జిపిఓ లు కలిసి తనిఖీలు చేపట్టగా రెండు ట్రాక్టర్లు ఒక బులోరా పట్టుబడ్డాయి. డోంగ్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పోతంగల్ మండలం కొడిచీర గ్రామం శివారు మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, ఒక బులోరా వాహనం ఇసుకతో కూడిన వాహనాలను పట్టుకున్నారు. ఈ తనిఖీలలో ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ వాహనాలను డోంగ్లి తహసిల్దార్ కార్యాలయం నందు సేఫ్ కస్టర్డ్ కొరకు ఉంచామని వారు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ తనిఖీ లో జిపి ఓలు బాల నరసయ్య, బాలయ్య, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



