సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన సినిమా‘కొత్త మలుపు’. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియాతో ముచ్చటించారు. నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. చిన్నప్పటి నుంచే సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. నా చదువుతో పాటు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఆ కృషి ఫలితమే ఈ సినిమా. ఈ చిత్రంలో నా పాత్ర పేరు వరలక్ష్మి. కొన సీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే అందమైన పాత్ర ఇది. నటిగా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన క్యారెక్టర్. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత సులభం కాదు. అయితే దర్శకుడు శివ వరప్రసాద్ చాలా ఓపికగా ప్రతి సన్నివేశాన్ని వివరించేవారు. ఏ డైలాగ్ అర్థం కాకపోయినా సులభంగా చెప్పి నటించడానికి సహాయపడ్డారు. హీరో ఆకాష్ కూడా ఎంతో సహకరించారు. మా నిర్మాత బాలకృష్ణ ఎక్కడా రాజీపడలేదు. ఈ సినిమాని ఇప్పటికే మూడు సార్లు చూశాను. చాలా బాగా వచ్చింది. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, కామెడీ, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి వర్గం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను.



