సాధారణంగా గ్రంథాలయం అనగానే మనకు నిశ్శబ్దంగా ఉండే గదులు, వరుసగా పేర్చిన పుస్తకాల అలమరలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఫిన్‌ల్యాండ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను రెంట్‌కి ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు, అవి ఒక సమాజ సృజనాత్మకతను, నైపుణ్యాన్ని జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన కేంద్రాలుగా మారాయి. ఫిన్నిష్ ప్రజల జీవితాల్లో లైబ్రరీ అంటే అది కూడా ఇల్లు లాంటిదే… ‘పబ్లిక్ లివింగ్ రూమ్’లా అన్నమాట. పుస్తకాలతో పాటు నిత్యజీవితంలో అవసరమయ్యే పనిముట్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు, క్రీడా సామాగ్రిని కూడా రెంట్‌కి ఇవ్వడం ద్వారా ఫిన్‌ల్యాండ్ ప్రపంచానికే ఒక కొత్త దారిని చూపిస్తోంది.
సొంతం చేసుకోవడం కంటే పంచుకోవడం మిన్న. నేటి వినియోగదారుల సమాజంలో మనం ఒక వస్తువును కేవలం ఒకటో రెండో సార్లు ఉపయోగించడానికి కొంటుంటాం. ఇది డబ్బు వృథా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేస్తుంది. ఫిన్‌ల్యాండ్ లైబ్రరీలు ఈ సమస్యకు ‘షేరింగ్’ (పంచుకోవడం) అనే అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. డ్రిల్లింగ్ మెషిన్లు, కుట్టు మిషన్లు, 3ణ ప్రింటర్లు వంటి ఖరీదైన పరికరాలను ప్రతి ఒక్కరూ కొనాల్సిన అవసరం లేకుండా లైబ్రరీలోనే అందుబాటులో ఉంచుతున్నారు. దీనివల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా, వ్యర్థాలు తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ‘ఓనింగ్’ (సొంతం చేసుకోవడం) కంటే ‘షేరింగ్’ గొప్పదనే భావనను ఇక్కడి వ్యవస్థ బలపరుస్తోంది.
మేకర్‌స్పేస్‌లు: సరికొత్త ఆవిష్కరణల వేదికలు ఫిన్‌ల్యాండ్ లైబ్రరీలు. ఇప్పుడు అత్యాధునిక ‘మేకర్ స్పేస్‌లు’గా రూపాంతరం చెందాయి. ఇక్కడ ప్రజలు తమ ఐడియాలకు ప్రాణం పోయవచ్చు. ఒక సామాన్య పౌరుడు తన ఇంట్లో విరిగిపోయిన వస్తువును రిపేర్ చేసుకోవడానికి ఇక్కడి టూల్స్ వాడవచ్చు, లేదా ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన కొత్త ఆవిష్కరణకు సంబంధించిన ప్రోటోటైప్‌ను 3D ప్రింటర్ సహాయంతో తయారు చేయవచ్చు. ఈ సౌకర్యాలన్నీ పూర్తిగా ఉచితం. శిక్షణ పొందిన సిబ్బంది, వాలంటీర్లు అక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉండి, కొత్త పరికరాలను ఎలా వాడాలో నేర్పిస్తారు. ఇది కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడమే కాకుండా, సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయం సమద్ధిని పెంపొందిస్తోంది.
సామాజిక సమానత్వం సస్టైనబిలిటీ
ఈ లైబ్రరీ నమూనా సామాజిక సమానత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు లేదా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా ధనికులతో సమానంగా అత్యాధునిక సాంకేతికతను, క్రీడా పరికరాలను పొందగలుగుతున్నారు. ఉదాహరణకు, శీతాకాలంలో అవసరమయ్యే ఖరీదైన జాకెట్లు, టెంట్లు లేదా క్యాంపింగ్ గేర్‌లను కేవలం లైబ్రరీ కార్డుతో ఉచితంగా పొందవచ్చు. దీనివల్ల ఆర్థిక వ్యత్యాసాలు తగ్గి, సమాజంలో ఐక్యత పెరుగుతుంది. అలాగే, వస్తువులను పారేయకుండా వాటిని రిపేర్ చేసి మళ్లీ వాడటం (Mend instead of throw away) అనే సంస్కృతిని ఇది ప్రోత్సహిస్తోంది.
ఊది (Oodi): భవిష్యత్ గ్రంథాలయానికి ఒక నమూనా హెల్సింకీ సెంట్రల్ లైబ్రరీ ‘ఊది’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఒక లక్షకు పైగా పుస్తకాలు ఉన్నప్పటికీ, అవి కేవలం మూడవ అంతస్తుకే పరిమితం. మిగిలిన అంతస్తుల్లో సినిమా థియేటర్లు, రికార్డింగ్ స్టూడియోలు, గేమింగ్ రూమ్స్ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. పాత కాలపు క్యాసెట్లు లేదా వీడియో టేపుల్లో ఉన్న జ్ఞాపకాలను డిజిటల్ రూపంలోకి మార్చుకోవడానికి ఇక్కడ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఇది కేవలం చదువుకునే చోటు మాత్రమే కాదు, ప్రజలు కలిసి చర్చించుకునే, కొత్త విషయాలు నేర్చుకునే ఒక సామాజిక సంగమ క్షేత్రం.
అభిరుచులను ప్రోత్సహించే లైబ్రరీ కార్డు మీ దగ్గర ఒక ఫిన్నిష్ లైబ్రరీ కార్డు ఉంటే, మీకు కేవలం సమాచారమే కాదు, వినోదం కూడా ఉచితంగా లభిస్తుంది. స్థానిక లైబ్రరీని బట్టి మీరు బేస్ బాల్ బ్యాట్లు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్కీయింగ్ బోర్డులు లేదా స్విమ్మింగ్ పూల్స్‌కు కూడా యాక్సెస్ పొందవచ్చు. నిట్టింగ్ (అల్లడం) వంటి పాతకాలపు కళల నుండి ఆధునిక ఈ-స్పోర్ట్స్ వరకు ప్రతి అభిరుచికి ఇక్కడ స్థానం ఉంది. ఇది ప్రజల మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడుతుంది.

కళలు, సాంకేతికత మేళవింపు
వీవింగ్ టేల్స్ (కథల అల్లిక): కొన్ని లైబ్రరీలలో ‘నోవెల్లికౌక్కు’ అనే వినూత్న కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కథలను వింటూ కుట్టుపని లేదా అల్లడం చేస్తారు. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.
మ్యూజిక్ ఫర్ ఆల్: సంగీత ప్రియుల కోసం గిటార్లు, డ్రమ్స్, పియానోలు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే తమ సొంత ఆల్బమ్‌ను రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేసుకోవచ్చు.
గేమింగ్ సెంటర్స్: ఫిన్‌ల్యాండ్ వీడియో గేమ్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. లైబ్రరీలలో రెట్రో గేమ్స్ నుండి ఆధునిక కన్సోల్స్ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది యువతను లైబ్రరీల వైపు ఆకర్షించడానికి ఒక గొప్ప మార్గం.
రీడింగ్ డాగ్స్: పిల్లల కోసం ఒక అద్భుత ప్రయోగం పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి ఫిన్‌ల్యాండ్ ‘రీడింగ్ డాగ్స్’ (చదివే కుక్కలు) అనే పద్ధతిని ప్రవేశపెట్టింది. పిల్లలు కుక్కల ముందు కూర్చుని పుస్తకాలు చదువుతారు. కుక్కలు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా (Nonjudgmental) శ్రద్ధగా వింటాయి కాబట్టి, పిల్లలు తప్పులు దొర్లుతాయనే భయం లేకుండా ఉత్సాహంగా చదువుతారు. ఇది వారి భాషా నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు కుక్కలే కాకుండా పోనీ గుర్రాలు, ఆవులు కూడా ఈ సేవలలో భాగస్వామ్యం అవుతున్నాయి. వాస్తుశిల్ప కళాఖండాలు ఫిన్‌ల్యాండ్ గ్రంథాలయాలు కేవలం సేవలకే కాదు, వాటి నిర్మాణ శైలికి కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.
హెల్సింకీ సెంట్రల్ లైబ్రరీ ఊది: దీని ఆధునిక డిజైన్ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కిర్కోనుమ్మి ఫ్యిరి: దీని ప్రశాంతమైన వాతావరణం పఠనానికి ఎంతో అనువైనది.
రోవానియెమి లైబ్రరీ: ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ అల్వర్ ఆల్టో దీనిని అద్భుతంగా రూపొందించారు. ఈ కట్టడాలు ఫిన్నిష్ సమాజం జ్ఞానానికి మరియు కళలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనాలు.
ప్రపంచానికి ఒక పాఠం: ఫిన్‌ల్యాండ్ గ్రంథాలయ వ్యవస్థ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది: ”జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండదు, అది అనుభవంలో, పనిముట్లలో పంచుకోవడంలో ఉంటుంది.” లైబ్రరీ అనేది సమాజంలోని ప్రతి వ్యక్తికి చెందిన ఆస్తి. అది సామాజిక అడ్డంకులను తొలగించి, అందరికీ సమాన అవకాశాలను కల్పించే ఒక వేదిక. ఒక లైబ్రరీ కార్డుతో ప్రపంచాన్ని మార్చవచ్చని, జీవన నాణ్యతను పెంచుకోవచ్చని ఫిన్‌ల్యాండ్ నిరూపించింది. భారతదేశం వంటి దేశాల్లో కూడా ఇలాంటి వినూత్న లైబ్రరీ మోడళ్లను ప్రవేశపెడితే, సృజనాత్మక సమాజం వైపు మనం కూడా వేగంగా అడుగులు వేయవచ్చు.
- డా|| రవికుమార్ చేగొని, 9866928327



