శబ్దం చేయదు… రక్తం కార్చదు… కానీ లోపల లోపల మనిషిని మెల్లగా చంపేస్తుంది. అదే… ఒంటరితనం. రాత్రి రెండు గంటలు. నగరం వెలుగులతో నిండిపోయింది. కానీ ఒక చిన్న గదిలో ఒక మనిషి నిద్రపోలేక పైకప్పునే చూస్తున్నాడు. ఫోన్ చేతిలో ఉంది. కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి. కానీ కాల్ చేయడానికి ఒక్క పేరు కూడా ధైర్యం ఇవ్వడం లేదు. ఇది ఆత్మహత్య కథ కాదు. ఇది ఒంటరితనం ఎలా మొదలవుతుందో చెప్పే కథ.
ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు. మన సమాజంలో ఉన్న పెద్ద అపోహ. ఒంటరితనం అంటే ఎవరు లేకపోవడం అని. కానీ నిజం వేరే. మన చుట్టూ మనుషులు ఉన్నా, మన మాటకు వినికిడి లేకపోతే, మన భావాలకు విలువ లేకపోతే, మనిషి లోపలే ఒంటరిగా మారిపోతాడు. ఇది ఒక్కరోజు బాధ కాదు; నెలల తరబడి మౌనంగా మనిషిని క్షీణింపజేసే దీర్ఘకాలిక మానసిక స్థితి.
చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే మిగిలిపోతే, అదే ఒంటరితనం. అడగాలనుకున్న సహాయం, అహంకారంగా మారితే, అదే ఒంటరితనం.
కేస్ స్టడీ
”అందరూ ఉన్నారు… కానీ నాకు ఎవరూ లేరు” రాజేష్ వయసు 34. మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం. మంచి జీతం. సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో ఒక రూమ్. బయటకు చూస్తే సెటిల్ అయిన యువకుడు. లోపల మాత్రం ఒంటరితనం. ఉదయం ఆఫీస్. సాయంత్రం ట్రాఫిక్. రాత్రి గదిలో నిశ్శబ్దం. తల్లిదండ్రుల కాల్స్ తగ్గాయి. ‘బిజీ’ అనే మాట అలవాటైంది. స్నేహితులు పెళ్లిళ్లు, పిల్లలతో దూరమయ్యారు. ఒక దశలో రోజుకు ఒక్క మనిషితో కూడా ముఖాముఖి మాట్లాడని రోజులు మొదలయ్యాయి.
లక్షణాలు: నిద్రలేమి, ఆకలి తగ్గడం, ఆఫీసులో ఆసక్తి కోల్పోవడం. తర్వాత మద్యం ఆధారం.
డైరీలో రాసుకున్న వాక్యం: ”నేను మాయమైతే ఎవరికైనా నిజంగా బాధ కలుగుతుందా?”
కుటుంబం గమనించి కౌన్సెలింగ్‌కు తీసుకురావడంతో రాజేష్ బతికాడు. కానీ అందరికీ ఆ అవకాశం దొరకడం లేదు. మానసిక ఆరోగ్యంలో దీర్ఘకాలిక ఒంటరితనం డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కూల్చేస్తుంది. ఆత్మహత్య ప్రమాదాన్ని పెంచుతుంది. పరిశోధనలు చెబుతున్నాయి. ఒంటరితనం ప్రభావం రోజూ సిగరెట్ తాగడమెంత ప్రమాదకరం? ఇది గుండె జబ్బులు, ఇమ్యూనిటీ తగ్గడానికీ సంబంధం కలిగి ఉంది.
వయసుల వారీగా ప్రభావం
పిల్లలు, టీనేజ్: తిరస్కరణ, పోలికలు? ఆత్మవిశ్వాసం తగ్గడం
వేల ఫాలోవర్లు ఉన్నా, ఒక్క నమ్మకం లేదు. వేల మెసేజ్లు ఉన్నా, ఒక్క ఓదార్పు లేదు.
యువత (20–35): ఉద్యోగ ఒత్తిడి, ప్రేమ విఫలం, దూర నగరాలు? అత్యంత ప్రమాదకర దశ
మధ్య వయసు: బాధ్యతలు, చెప్పుకోలేని ఒత్తిడి
వృద్ధులు: కుటుంబ దూరం, భాగస్వామి లేకపోవడం?, డిప్రెషన్, త్వరిత మరణ ప్రమాదం. కుటుంబాల్లో పెరుగుతున్న మౌనం ఇల్లు ఉంది, కానీ గుండెకి ఆశ్రయం లేదు. మనుషులు ఉన్నారు, కానీ మనసుకు చోటు లేదు. ఇల్లు నిండా మనుషులే. కానీ మాటలు లేవు. ఫోన్లు చేతుల్లో, ఒత్తిడులు మనసుల్లో. ఇలా తయారవుతోంది మాటలేని కుటుంబ వ్యవస్థ.
ఒంటరితనం – గుర్తించే సంకేతాలు
-ఎప్పుడూ అలసట, నిద్రలేమి
-ఆసక్తి కోల్పోవడం
-మద్యం/ స్క్రీన్‌పై అధిక ఆధారం
-లి ‘నేను అవసరం లేను’ అనే ఆలోచనలు
పరిష్కారం – చిన్న అడుగులు
వినడం. సమయం ఇవ్వడం. ”నువ్వు ఒంటరిగా లేవు” అని చెప్పడం. ఇవే మొదటి అడుగులు. ఇది ఒక వ్యక్తి కథ కాదు. ఇది మన సమాజం ప్రతిబింబం. ఈ రోజు మనం వినకపోతే.. రేపు ఇంకొకరు మౌనంగా మాయమవుతారు. ఒక్క మాట…ఒక్క వినికిడి… ఒక ప్రాణాన్ని కాపాడగలదు. చెప్పుకోగలిగితే బాధ తక్కువ అవుతుంది, వినగలిగితే జీవితం బలపడుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



