నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమాలలో ఒకటైన Republic Day Camp (RDC) 2026కి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, శెట్పల్లి గ్రామానికి చెందిన మోక్ష శ్రీ మహారాజ్ ఎంపికయ్యారు. ఆమె జాతీయస్థాయిలో హైదరాబాద్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ డైరెక్టరేట్‌కు ప్రాతినిధ్యం వహించారు.
క్యాడెట్‌లను వారి అసాధారణ పనితీరు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం, మొత్తం సామర్థ్యం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఆర్‌డీసీలో పాల్గొనడం అరుదైన గౌరవంగా, దేశం పట్ల క్యాడెట్ అంకితభావం, నిబద్ధతకు నిదర్శనంగా పరిగణించబడుతుంది. జాతీయ స్థాయిలో గత ఆరునెలల పాటు దేశవ్యాప్తంగా తుది ఎంపికకై పలు స్థాయిల్లో కఠినమైన పరీక్షల ద్వారా నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలను విజయవంతంగా అధిగమించిన సర్జెంట్ మోక్షశ్రీ పట్టుదలతో, తన అత్యుత్తమ పనితీరుతో రిపబ్లిక్ డే క్యాంప్‌లో స్థానం కైవసం చేసుకున్నారు.
మోక్షశ్రీ హైదరాబాద్, కింగ్‌కోటిలోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతుంది. రిపబ్లిక్ డే పరేడ్ న్యూఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్‌లో జరిగిన పరేడ్‌లో పాల్గొని, భారత ప్రధానమంత్రికి గౌరవవందనం సమర్పించే బృందంలో సభ్యురాలిగా నిలిచింది. గతంలోనూ అనేక ఉన్నతస్థాయి అధికారిక ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నది. ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి దేశం గర్వించే స్థాయిలో ‘కర్తవ్యపథానికి’ అడుగులు వేయడమంటే ఆషామాషీ కాదు. కలలు కనే యువతరానికి స్ఫూర్తిని నింపే విజయం ఇది. లక్ష్యం పట్ల అంకితభావం ఉంటే హద్దులు అడ్డంకికావు అని మోక్షశ్రీ నిరూపించింది. రాబోయేతరాలకు, ముఖ్యంగా రక్షణరంగం వైపు వెళ్లాలనుకునే బాలికలకు ఆమె ఒక రోల్ మోడల్.
ఆమె తన సంకల్ప సాధనలో దేశభక్తిని చాటుకున్న ఈ ప్రయాణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు శిరోమకుటమైన కీర్తిని తెచ్చిపెట్టింది. చదువుతో పాటుగా మోక్షశ్రీ చిత్రకళ, సంగీతంలో కూడా ప్రావీణ్యతను కలిగి ఉంది. మోక్షశ్రీ సాధించిన ఈ విజయానికి తల్లిదండ్రులు శ్రావణి, అశోక్ మహారాజ్‌లు, అధ్యాపకులు, బంధుమిత్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోక్ష శ్రీ ఎంపిక ఆమె కుటుంబానికి, సంస్థకు, ఎన్‌సీసీ విభాగానికి గర్వకారణమైన విజయంగా, ఇతర క్యాడెట్‌లకు ప్రేరణగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఆమె మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.
కల నుండి కర్తవ్యానికి
- Advertisement -
- Advertisement -



