ఎక్కడ …ఎప్పుడో ..ఒక మాట చదివిన జ్ఞాపకం … బుల్లితెర మనిషిని చిన్నగా చూపిస్తుంది వెండితెర మనిషిని పెద్దగా చూపిస్తుంది. కానీ రంగస్థలం మాత్రం మనిషిని మనిషిగా చూపిస్తుంది అని. దానికి నేను కొనసాగింపుగా పుస్తకం మాత్రం జీవితాన్ని జీవితంగా చూపిస్తుంది అని రాసుకున్నాను. మరింత లోతుల్లోకి వెళితే సినిమా పుస్తకాలు మనిషికి ఎంతో స్ఫూర్తిదాయకంగా మారుతాయి, మారుస్తాయి. ఎందుకంటే వేల్పులుగా కొలిచే జనాలకి సినిమా వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అని తొంగి చూసే ఆత్రుత ఎక్కువ కదా! తెర వెనుక జరిగే విశేషాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే సినిమా పుస్తకాలకి పాఠకులు ఎందరో ఉంటారు. బాగా ప్రచారం కూడా దక్కుతుంది. ఆ మాటను నిజం చేస్తూ ఈ మధ్యన వచ్చిన పుస్తకం తెలంగాణ సినీ ప్రస్థానం. ఈ పుస్తకాన్ని రాసింది సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర.
రెండు దశాబ్దాలుగా పొన్నం రవిచంద్ర సినిమా పాండిత్యాన్ని దగ్గర ఉండి చూడటం వలన అనుకుంటా తన ప్రతి రచనను చదివే అవకాశం కలిగింది. ఒకప్పుడు అత్యధిక కవర్ స్టోరీలు రాసి చరిత్ర సష్టించిన మామిడి హరికష్ణలా గత రెండు సంవత్సరాలుగా పొన్నం రవిచంద్ర ఎక్కువ కవర్ స్టోరీస్ సినిమాల మీదనే రాసి, తన సినీ జ్ఞానాన్ని అందరికీ పంచుతూనే వచ్చారు. గతంలో తాను రాసిన ప్రస్థానం 80 ఏళ్ళ సినిమా చరిత్ర కానివ్వండి, ఫస్ట్ హీరో పైడి జయరాజు పుస్తకం కానివ్వండి సినీ సాహిత్య పుస్తక రంగంలో తన ప్రస్థానాన్ని మరింత స్థిరవంతం చేశాయి. ఇప్పుడు వచ్చిన ఈ తెలంగాణ సినీ ప్రస్థానంతన ఆలోచన లోతుల్ని మనకు ఎరుక పరుస్తుందని చెప్పాలి.
పొన్నం రవిచంద్ర దాదాపు ఐదేళ్లపాటు మొక్కవోని దీక్షతో చేసిన పరిశోధనా ఫలం ఈ పుస్తకంగా మనకు తెలుస్తుంది. అది ప్రతి పుటలోను కనిపిస్తుంది. తాను పుట్టి పెరిగిన ఈ తెలంగాణ మట్టి వైభవాన్ని సినీ రంగంలో స్థిరపరిచే ఈ బహత్ ప్రయత్నాన్ని ఆయన తన నేల తల్లికి కతజ్ఞతగా అందిస్తున్న చిరుకానుకని చెప్పటం ఆయన వినయసంపన్నతకు నిదర్శనం. నిజాం పాలనలో… హైదరాబాద్ రాజ్యంలో… తెలంగాణ సినిమా తీరుతెన్నులు ఒక అంశమైతే.. స్వాతంత్రానంతర కాలంలో తెలంగాణ సినిమా అంటే 1948 నుంచి 1973 వరకు… తెలంగాణ సినిమా తొలి దశ అంటే 1974 నుంచి 1990 వరకు…. ఆ తర్వాత తెలంగాణ సినిమా రెండో దశని 1991 నుంచి 2011 వరకు చెప్తారు. తెలంగాణ సినిమా అస్తిత్వ దశని 2012 నుంచి ఇప్పుడు కొనసాగుతున్న కాలం వరకు తీసుకున్నారు. భారతీయ సినీ వినీలాకాశంలో తెలంగాణ సినిమాల దశ దిశలను శాస్త్రీయంగా, సాధికారికంగా, సమగ్రంగా అందించే అపూర్వ గ్రంథంగా ఈ పుస్తకం చరిత్రను సృష్టించిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
1913 సంవత్సరంలో దేశంలో తొలి సినిమా అడుగుపెట్టిన తరుణంలోనే హైదరాబాద్ సంస్థానంలో కూడా చైతన్యం రగలటం మనందరికీ తెలిసిన అంశమే. అయితే రికార్డ్ సరిగా చేయబడలేదని ఇప్పటివరకు మనం భావిస్తూ, బాధపడుతున్నాం. ఇప్పుడు ఎంతోమంది ఆ వైపుగా పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు ఎంతో దోహదకారిగా నిలవగలిగిన పరిశీలనలు, పరిశోధనలు, చర్చలు, లోతైన ఆలోచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా లోటస్ ఫీలింగ్ కంపెనీ స్థాపించి ఎనిమిది సినిమాలను 1920లోనే తీసిన దర్శకుడు థేరేన్ గురించి చాలా విలువైన సమాచారం కనిపిస్తుంది. 300 సినిమాలకు పైగా పనిచేసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్‌గా మనం భావిస్తున్న పైడి జయరాజ్ గురించిన ఎన్నో విశేషాలు ఎరుక పరుస్తుంది ఈ పుస్తకం. భారతీయ సినిమా విస్తరణలో హైదరాబాద్ పాత్ర గురించి సగౌరవంగా చాటిన దశలు ఎక్కువ. ఐతే తెలంగాణ తొలినాళ్ల సినిమా ప్రస్తానాన్ని వెలుగులోకి తేవడానికి తన వంతుగా ఈ పుస్తకం రాశారు.
వీరు కొన్ని సూచనలు వేస్తూ ఫిలిం మ్యూజియం, గ్రంథాలయం, ఆర్‌కేవ్స్ లైబ్రరీ కావాలని మంచి సూచనలు అందించారు పొన్నం రవిచంద్ర. తన ప్రతి పుస్తకం సినీ లిటరసీని పెంచేదిగా ఉంటుంది.
ఒకప్పుడు మిత్రుడు మాటల్లో అంటూ తెలంగాణ వచ్చాక సినిమాలు వేగవంతం అయ్యాయని తెలంగాణ సినిమాల్లో వాస్తవిక ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. కానీ తెలంగాణ సినిమా ఎంత ప్రాచీనమైనదో చాలా ఎక్కువ మందికి తెలియదు. 1921 ప్రాంతంలో ఎనిమిది సినిమాలను నిర్మించిన సినీ దర్శకుడు భారతీయ సినిమా వైతాళికలలో ఒకడైన దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్యల సరసన నిలువ కలిగిన ధీరేన్ గంగూలీ, పైడి జయరాజుల గురించి, అంకుర్ చిత్రదశ్యం తెలంగాణ కథలకు శ్రీకారం చుట్టిందన్న సంగతి గానీ, చిల్లర దేవుళ్ళు పోస్టల్ గురించి గానీ, దాసి చిత్రం నేపథ్యం కానీ భారతీయ సినిమా గమనంలో క్రాస్ ఓవర్ సినిమా అనేది ఒక ప్రత్యేక తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టిన విశేషాలు ఇందులో కనిపిస్తాయి.
తొలి చిత్రం నగేష్ కుకునూరు దర్శకత్వ వహించిన హైదరాబాద్ న్యూస్ అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ‘కొమరం భీమ్’ తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడి కథను శ్రీధర్ తీసి హిస్టారికల్ బయోపిక్ తరహాలో మేలు మలుపుగా నిలిపారు. ‘జై బోలో తెలంగాణ’ మనందరికీ తెలిసిందే. ఎన్ శంకర్ దర్శకత్వంలో సమకాలీన చరిత్రను అందరికీ ఎరుకపరచిన సినిమా ఇది. ‘మల్లేశం’ సినిమా పద్మశ్రీ అవార్డు సాధించిన సాధారణ చేనేత కళాకారుడి జీవన గాధను వెలికి తీసిన సినిమాగా మనందరికీ తెలిసిందే. ఓటిటి దాడికి గురై సినీ థియేటర్లు కుదైలైపోతున్న సమయంలోనూ ప్రతి గ్రామంలో తెరలు కట్టి బహిరంగ సామూహిక ప్రదర్శనలు చేసిన ‘బలగం’ సినిమా కూడా మనందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాల నేపథ్యాలను ఇక్కడ పొందుపరిచారు. యాకూత్ మహల్ సినిమా థియేటర్ గురించిన విశేషాలు కూడా చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు.
ముఖ్యంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. 1924 లో హైదరాబాద్‌లో విడుదలైన రజియా బేగం సినిమాని తీసిన నాను భాయ్ దేశాయ్ అంటే సినిమాని తీసిన దర్శకుడు ఈ సినిమాకున్న ఆసక్తికరమైన సెన్సార్ చరిత్ర ఎంతో మంది విన్నారు కానీ నేపథ్యం తెలియదు. హైదరాబాదులో ఒక మత వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బ తినే కథగా చూపిస్తూ, దీన్ని ప్రదర్శిస్తే 24 గంటల్లోపు హైదరాబాద్‌ను వదిలి వెళ్లాలని అప్పటి మన నిజాం ప్రభు ఆదేశించిన అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. సినీ మా చట్టాన్ని కూడా నిజాం సర్కారు సినీ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంగా కూడా గుర్తు చేసుకోవాలి. ఒకసారి మోతి మహల్ (కోటిలోని సుల్తాన్ బజార్లో ఉండేది) కాలేజ్ సినిమా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 14 మంది దాంట్లో మరణించారు. అప్పుడు 1937 లోనే చట్టం తీసుకొచ్చింది నిజాం ప్రభుత్వం.
ఇంకా పైడి జైరాజ్, విలన్ అజిత్, బి.యస్. నారాయణ, కాంతారావు, ప్రభాకర రెడ్డి, బి.నర్సింగ్‌రావు లు చేసిన అశేష కషిని అక్షర బద్దం చేసారు. తెలుగు హీరోయిన్లు సినిమాల్లోకి రావడం లేదని బాధపడుతుంటారు కానీ విజయశాంతి లేడీ హీరోయిజంతో అసమాన్య ఖ్యాతి గడించింది అని మర్చిపోతుంటారు. ఆమె మన వరంగల్ అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. 1966 జూన్ 24వ తేదీన వరంగల్లో జన్మించి, మద్రాస్‌లో తన పిన్ని విజయ లలిత దగ్గర పెరిగింది విజయశాంతి. మాధవి 1962 సంవత్సరంలో సెప్టెంబర్ 14వ తేదీన హైదరాబాద్లోనే జన్మించారు. హైదరాబాద్ ఆబిడ్స్‌లోని స్టాండ్లీ గర్ల్స్ హైస్కూల్లో చదువుకున్నారని సంగతి కూడా చాలామందికి తెలియదు. మాధవి గురించిన సమాచారాన్ని కూడా ఇక్కడ అందించారు. టబుని బాలీవుడ్ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నామని చాలా మంది అనుకుంటారు. కానీ టబు అసలు పేరు తబుసం హష్మీ. ఆమె నవంబర్ 4వ తేదీన హైదరాబాద్లో జన్మించారు.
అంతే కాక దర్శక నిర్మాతల గురించిన సరైన సమాచారాన్ని ఈ పుస్తకం చాలా చక్కగా తెలియజేసింది. టి. మాధవరావు, భాస్కరరావు, లక్ష్మీదీపక్, అల్లాణి శ్రీధర్, నిమ్మల శంకర్, నందిని రెడ్డి, హరీస్ శంకర్, దిల్‌రాజ్ గురించే కాకుండా దశరద్ కుమార్, సంపత్ నంది, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగ, సంకల్ప రెడ్డి, తరుణ్ భాస్కర్, సురేందర్ రెడ్డి, వేణు శ్రీరామ్, శ్రీధర్ రెడ్డి, హను రాఘవ పూడి, విశ్వక్సేన్, వెంకీ కుడుముల, అనుదీప్, నాగ్ అశ్విన్, క్రాంతి మాధవ్, వేణు ఉడుగుల, సాగర్ చంద్ర, కెవిఆర్ మహేంద్ర, వేణుఎలిదండి, సానాయాదిరెడ్డి… ఇలా వీరందరి విశేషాలు కూడా ఒక్కొక్క పేజీలో పొందుపరిచారు.
అలాగే తెలంగాణలో ప్రముఖ నటులుగా వెలుగొందుతున్న వారిగురించి, సినీ గేయ రచయితలు, సంగీత దర్శకులు, గాయకుల గురించి కూడా రాసారు. ముఖ్యంగా తెలంగాణకి ప్రతి రూపంగా నిలిచిన సినిమాలు అంటూ తనకోణంలో 38 సినిమాలను పొందుపరిచారు. 80 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 100 పాటల విశ్లేషణలను పొందుపరిచి కొత్త పుంతలు తొక్కినట్టే ఈ పుస్థకంలో కూడా తనదైన ముద్ర చూపించారు. పుస్తకం చివరి పేజీలలో గద్దర్ అవార్డ్స్ వివరాలను ఇచ్చారు. మొత్తం మీద తెలంగాణ సినీ ప్రస్థానం చరిత్రలో నమోదుకాని చాలా అంశాలను ప్రస్తావించి గ్రంథస్తం చేసి శాశ్వత తత్వాన్ని అందించింది. కొన్ని విషయాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి దమ్ము కావాలి. పరిశీలించే ఓర్పు కావాలి. అవి రెండూ పుష్కలంగా ఉన్న వ్యక్తి, సినీ విలక్షణ పరిశోధకుడు డా పొన్నం రవి చంద్ర నుండి మరిన్ని పుస్తకాలు రావాలని ఆశిద్దాం.
- అయినంపూడి శ్రీలక్ష్మి, 9989928562



