నవతెలంగాణ-హైదరాబాద్: ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి/తుగ్లకాబాద్ (Govindpuri/Thuglakabad) ఎక్స్టెన్షన్ ప్రాంతంలో జూన్ 12న ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పంకజ్ (28), ఆయన తల్లి గుడ్డి దేవి (50), సోదరి సోని (20) మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.అగ్నిప్రమాదం కేసులో ఊహించని మలుపు వెలుగుచూసింది. తాజాగా లభించిన సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) పోలీసుల దర్యాప్తును పూర్తిగా మార్చేసింది.మంటలు అంటుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఓ మహిళ భవనంలోకి వెళ్లడం, ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి వేగంగా బయటకు వచ్చేయడం కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు కుట్ర బయటపడింది.
గోవింద్‌పురి (Govindpuri) ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. బిల్డింగ్ 5వ అంతస్తులో ఉండే దీపక్ (Deepak) అనే వ్యక్తిపై కక్షతో భవనం కింద పార్క్ చేసి ఉన్న అతని మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టడమే తమ ప్లాన్ అని ఆమె తెలిపింది. గిరినగర్‌కు చెందిన సరిత (27) అనే మహిళ తనకు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె ఇచ్చి బైక్‌కు నిప్పు పెట్టమని పంపినట్లుగా బాలిక కోర్టుకు తెలిపింది. సరిత వెనుక అసలు మాస్టర్ మైండ్స్ నిరంజన్ (33), అతని తమ్ముడు రాజ్‌కుమార్ (27) అని పోలీసులు తేల్చారు. నిరంజన్‌కు దీపక్‌తో పాత ఆర్థిక, వ్యక్తిగత గొడవలు ఉంగా.. నిరంజన్ గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తి కావడం, జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యాడు. టార్గెట్ కేవలం బైక్ మాత్రమే అయినప్పటికీ, ఆ మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించడంతో.. సంబంధం లేని ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



