నవతెలంగాణ-కమ్మర్పల్లి: మండలంలోని నాగాపూర్ గ్రామంలో సోమవారం సానిటేషన్లో భాగంగా కచ్చ డ్రైనేజీల్లో కూడికతీత పనులను చేపట్టినట్లు సర్పంచ్ కంపదండి అశోక్ తెలిపారు. గ్రామంలో జెసిబి తో చేపట్టిన కచ్చ డ్రైనేజీ పూడికతీత పనులను ఉపసర్పంచ్ ఉల్లెంగుల శశిధర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామం నుండి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వెళ్లే రోడ్డులో, గ్రామం నుండి ఉప్లూర్ గ్రామ పరిధిలోని దమ్మన్నపేట వెళ్లే రోడ్డులో ఈ కచ్చ డ్రైనేజీ పూడికతీత పనులను చేపట్టినట్లు వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో కచ్చ డ్రైనేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. కచ్చ డ్రైనేజీలు కూడుకుపోవడంతో గ్రామం నుండి బయటకు వెళ్లాల్సిన మురుగునీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల నిర్ణయం మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని కచ్చ డ్రైనేజీలను బాగు చేసే పనులను చేపట్టామన్నారు. గ్రామ పరిధిలో చెత్తాచెదారంతో కూడుకుపోయిన కచ్చ డ్రైనేజీలను జెసిబితో తీయించి శుభ్రం చేయిస్తున్నామన్నారు. తీసిన చెత్తాచెదారాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. కచ్చ డ్రైనేజీలకు మరమ్మత్తులు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


