Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంసమాచార హక్కును నాశనం చేసేలా గోప్యతా హక్కును ఉపయోగిస్తున్నారా ?

సమాచార హక్కును నాశనం చేసేలా గోప్యతా హక్కును ఉపయోగిస్తున్నారా ?

- Advertisement -

డీపీడీపీ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు
రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన సుప్రీం


న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పారదర్శక, జవాబుదారీ ప్రభుత్వమనేది పౌరుల హక్కు అని కానీ కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ) ఆ హక్కును పూర్తిగా దెబ్బతీసేలా వుందని వాదిస్తూ దాఖలైన పలు పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఆర్టీఐ చట్టం కింద చేసే దరఖాస్తులపై డీపీడీపీ చట్టం, 2023లోని సెక్షన్‌ 44(3) పూర్తి నిషేధం విధిస్తోంది. వ్యక్తిగత సమాచారం వెల్లడించాలని కోరకుండా వారిని నివారిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. పౌరుల సమాచార హక్కును నిర్వీర్యం చేయడానికి ఈ నిబంధన గోప్యతా హక్కును అత్యంత మూర్ఖంగా ఉపయోగిస్తోందని వారు వాదించారు.

‘సంక్లిష్టమైన, కాస్త సున్నితమైన, వాస్తవంగా ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న’ను పిటిషన్లు లేవనెత్తాయని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. అయినా సెక్షన్‌ 44(3) అమలుపై స్టే విధిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్ధనను చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. అసలు ‘వ్యక్తిగత సమాచారం’ అంటే ఏమిటో మనం నిర్వచించాల్సి వుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.పిటిషనర్‌ వెంకటేష్‌ నాయక్‌ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్‌ వృందా గ్రోవర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉలిని ఉపయోగించడానికి బదులుగా సుత్తిని ఉపయోగించి పౌరుల సమాచార హక్కును దారుణంగా దెబ్బతీస్తున్నారని వాదించారు. సెక్షన్‌ 44(3) ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(జె)ని సవరించిందని పిటిషనర్లు వాదించారు.

దరఖాస్తుదారుడు కోరిన వివరాలకు ఏ ప్రజా కార్యకలాపాలతో సంబంధం లేదని, లేదా ఒకవేళ వెల్లడించడం వల్ల గోప్యత దెబ్బ తీస్తుందనుకున్నట్లైతే దరఖాస్తుదారుడి వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు వెల్లడించకుండా ఆర్టీఐ నిబంధన మినహాయింపు నిచ్చింది. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాలు మిన్నగా వున్నాయనుకుంటే గోప్యతను కాదని ప్రభుత్వం ఆ వివరాలు వెల్లడించవచ్చు. గోప్యతా, పారదర్శకత ఆందోళనలను పూర్తిగా, కూలంకషంగా పరిశీలించిన తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించాలా లేదా అనే నిర్ణయం తీసుకునేది ప్రజా సంబంధాల అధికారి లేదా ఆర్‌టిఐ చట్టం కింద ఫస్ట్‌ అప్పిలెంట్‌ అథారిటీ. ఆర్‌టిఐ చట్టంలో 8(1)(జె) సెక్షన్‌, గోప్యతా హక్కు, సమాచార హక్కుల మధ్య గల సరైన సమతూకాన్ని దెబ్బతీసిందని నేషనల్‌ కేంపైన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ తరపున వాదిస్తున్న న్యాయవాదులు ప్రశాంత్‌ భూషణ్‌, రాహుల్‌గుప్తాలు వాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -