Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్‌ షా.. ఆరోపణలకే పరిమితమా!

అమిత్‌ షా.. ఆరోపణలకే పరిమితమా!

- Advertisement -

చొరబాటుదారులపై కేంద్రమంత్రి తీరు
హౌం మంత్రిత్వ శాఖ వద్ద లేని సమగ్ర సమాచారం
ఆర్టీఐ దరఖాస్తుతో బహిర్గతం
అసోం, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల కుయుక్తులు
ఒక వర్గం ప్రజలే టార్గెట్‌గా రెచ్చగొట్టే చర్యలు


న్యూఢిల్లీ : దేశంలో భావోద్వేగం కలిగించే ఏ ఒక్క సున్నిత అంశాన్నైనా తన రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడంలో బీజేపీ ముందుంటుంది. రాష్ట్రాన్ని బట్టి తన వ్యూహాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు అసోం, పశ్చిమ బెంగాల్‌ విషయంలోనూ బీజేపీ అదే పద్ధతిని అవలంభిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ కన్ను పడింది. అక్కడ ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్నది కాషాయపార్టీ భావిస్తున్నది. అందుకు ఇప్పటికే అనేక విఫల ప్రయత్నాలను చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్నది. ఆ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని సాధిస్తామని ఆశించిన బీజేపీ భంగపడింది. దీంతో ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక్కడ అధికారం దక్కించుకోవడం కోసం అనేక పాట్లు పడుతున్నది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అమలు ఇందులో భాగమని పలువురు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. దీనితో పాటు ‘చొరబాటుదారులు’ అనే అంశాన్ని కాషాయపార్టీ గట్టిగా వినిపిస్తున్నది. బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌, అసోంలలలోకి చొరబాటుదారులు లక్షల సంఖ్యలో వస్తున్నారని ఆరోపిస్తున్నది. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాతో పాటు అసోం, పశ్చిమ బెంగాల్‌లోని పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ ఆరోపణలు చేస్తున్నవారిలో ఉన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి.. కీలకమైన హౌం శాఖను చూస్తున్న ఆయన ‘చొరబాటుదారులు’ అంశాన్ని ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఉపయోగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘సర్‌’ అంశాన్ని ఇప్పటికే హైకోర్టుకు తీసుకెళ్లిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని.. చొరబాటుదారుల విషయంలో ఇరుకున పెట్టడంతో పాటు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి దానిని ఓట్లుగా మలుచుకొనే ప్రయత్నాలను అమిత్‌ షా చేస్తున్నారని వారు అంటున్నారు.

బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు ఏం చేసింది?
బీజేపీ ఎప్పుడూ చెప్తున్నట్టుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాషాయ పార్టీ ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారే. కేంద్రంలో మూడు సార్లు, రాష్ట్రంలో రెండు సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నది. అయితే గత 10-15 ఏండ్లలో బీజేపీ ఈ చొరబాటుదారులను ఎందుకు ఏరివేయలేకపోయిందని సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చొరబాటుదారుల విషయంలో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వద్ద సమగ్ర సమాచారం లేదు.

సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందనగా వచ్చిన సమాధానమే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. చొరబాటుదారుల గుర్తింపు, అరెస్ట్‌, డిపోర్టేషన్‌పై ఎలాంటి సమగ్ర డేటా లేదని వెల్లడైంది. చొరబాటుదారుల గుర్తింపు, నిర్బంధం, డిపోర్టేషన్‌ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించబడ్డాయనీ, దీంతో కేంద్ర స్థాయిలో సమగ్ర గణాంకాలు లేవని పేర్కొంది. సమాచార హక్కు కార్యకర్త కన్హయ్య కుమార్‌ చేసిన దరఖాస్తుకు.. కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విధంగా స్పందించింది.

ఒక మతం వారిపై ‘చొరబాటుదారులు’గా ముద్ర
సామాజిక కార్యకర్త హర్ష మందర్‌ ఈ విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సేకరించిన డేటాను కేంద్రం సమీకరించగలదనీ, అయితే డేటా లేదని చెప్పడం నమ్మశక్యంగా లేదని అన్నారు. అసలు భారతీయ చట్టాలలో ‘చొరబాటుదారు’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదనీ, ఆ పదాన్ని వినియోగించటం ద్వారా కొందరిపై చెడు ముద్ర వేస్తున్నారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రజల్లో భయాందోళనలు
కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సీఏఏ, ఎన్నార్సీ, ప్రస్తుత ‘సర్‌’తో పాటు చొరబాటుదారులంటూ బీజేపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలన్నీ ఒక మతం ప్రజలను టార్గెట్‌ చేసుకుంటూ సాగుతున్నాయని రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు ఏ మాత్రమూ సరికావని హెచ్చరిస్తున్నారు. ఇది రాజకీయంగా భయాందోళనలను పెంచే ప్రయత్నమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చొరబాటుదారులు 64 లక్షల మంది : అమిత్‌ షా
ఇటీవల అసోంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ధుబ్రి, బార్పేట, దర్రాంగ్‌, మోరిగావ్‌, బోంగైగావ్‌, నాగావ్‌, గోల్పారా, జిల్లాలను 64 లక్షల మంది చొరబాటుదారులు ఆక్రమించారని ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ పాలనలో జరిగిందనీ, దీనిని పరిష్కరించేది ఒక్క బీజేపీ మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ కేంద్ర హౌం మంత్రిగా ఉన్న ఆయన.. చొరబాటుదారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో ఆయన ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో కొత్త ప్రశ్నలు అందరి మెదళ్లనూ తొలుస్తున్నాయి.

అసోం సీఎం రెచ్చగొట్టే చర్యలు
తన వివాదాస్పద చర్యలు, మాటలతో వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ… ‘చొరబాటుదారులు’ అంటూ అమిత్‌ షా జాడలో పయనిస్తున్నారు. వారిని బంగ్లాదేశ్‌కు పంపిస్తున్నామని ప్రకటించారు. సీఎంగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకుంటూ ఉంటన్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే ఈ చర్యలు చట్టపరమైన ప్రక్రియ లేకుండా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చొరబాటుదారులను తరలిస్తే అందులో సంబంధిత దేశానికి సమాచారం ఇవ్వడం, ధృవీకరణ వంటి దశలు ఉండాలి.

కానీ సరైన న్యాయ ప్రక్రియ లేకుండా తరలిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుందని మేధావులు చెప్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి చర్యలూ తీసుకోని బీజేపీ.. అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చొరబాటుదారులంటూ కొత్త భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తెస్తున్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో లబ్ది పొందడంలో భాగంగా బీజేపీ వేస్తున్న కుయుక్తులని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -