Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయండిగ్రీ ఒక్కటే చాలదు

డిగ్రీ ఒక్కటే చాలదు

- Advertisement -

నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న జాబ్‌ మార్కెట్‌
మొదటి రోజు నుంచే పనితనం చూపాలంటున్న యాజమాన్యాలు

న్యూఢిల్లీ : మన దేశంలో ఉద్యోగ మార్కెట్‌ నాటకీయ పరివర్తనకు లోనవుతున్న కొద్దీ ఓ స్పష్టమైన విషయం బోధపడుతోంది. చేతిలో కళాశాల డిగ్రీ ఉన్నంత మాత్రాన మంచి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఏమీ లేదు. విద్యార్హతలు, పని ప్రదేశంలో అంచనాల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. పట్టభద్రులు గతంలో కంటే ఇప్పుడు వేగంగా ఉద్యోగ మార్కెట్‌లో ప్రవేశిస్తున్నారు. అదే సమయంలో తమ వద్ద ఉన్న డిగ్రీలు సురక్షితమైన ఉద్యోగ కెరీర్‌ను కల్పిస్తాయన్న హామీని పొందలేకపోతున్నారు. యాజమాన్యాలు ఇకపై విద్యా సంబంధమైన అర్హతలతో సంతృప్తి చెందబోరు.

వారు ఆచరణాత్మకమైన, ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, డిజిటల్‌ టెక్నాలజీ, డేటా విశ్లేషణలు వంటి రంగాలలో నిపుణుల అవసరం ఎంతో ఉంది. చాలా మంది విద్యార్థులకు ఈ మార్పు ఉత్తేజకరమైనదే కానీ అదే సమయంలో ఆందోళన కూడా కలిగిస్తోంది. అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సంప్రదాయ పరమైన కళాశాల పాఠ్యాంశాలు విద్యార్థులను యజమానుల డిమాండ్లకు సిద్ధం చేయడం లేదు. దీంతో ఇక డిగ్రీలు మాత్రమే తమకు ఉద్యోగాలు కల్పించలేవన్న వాస్తవాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యం కలిగిన యువతను సన్నద్ధం చేయడానికి ఉన్నత విద్య ఎలా దోహదపడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

నిపుణత ఉంటేనే ఉద్యోగం
నైపుణ్యం ఆధారంగా నియామకాలు జరిగే విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యాజమాన్యాలు డిగ్రీలు, అనుభవాన్నే కాకుండా ప్రధానంగా ఉద్యోగుల నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఏఐ, డిజిటల్‌ సాధనాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నదని పరిశ్రమ నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే అవి ఎంట్రీ-లెవల్‌ ఉద్యోగాలకు అవసరమవుతున్నాయి. నియామకాల బోర్డులో ఉన్న వారు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటే. ‘ఈ అభ్యర్థి మొదటి రోజు నుంచి ఏం చేస్తాడు?’. డిగ్రీలు జ్ఞానాన్ని అందిస్తాయి కానీ యాజమాన్యాలు నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయని ఓ పరిశ్రమ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంబంధమైన నైపుణ్యం ఉంటే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన సమయం తగ్గుతుందని, వేగంగా మారుతున్న పని విధానానికి వారు సులభంగా అలవాటు పడతారని ఆయన తెలిపారు.

డిగ్రీలు పునాది మాత్రమే
దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువ మందికి తగినంత నైపుణ్యం లేకపోవడంతో వారు వెంటనే ఉద్యోగాలు పొందలేకపోతున్నారని స్కిల్‌ రిపోర్ట్‌ చెబుతోంది. విద్యా సంబంధమైన శిక్షణ, పరిశ్రమ అవసరాల మధ్య నిరంతర అంతరాన్ని ఇది సూచిస్తోంది. ఉద్యోగంలో ప్రవేశించడానికి ముందే పట్టభద్రులకు ఆచరణాత్మక అనుభవం అవసరమని అనేక సర్వేలు, అధ్యయనాలతో పాటు హెచ్‌ఆర్‌ నిపుణులు కూడా చెబుతున్నారు. డిగ్రీలు పునాదిని ఇస్తాయని, అయితే కార్యాలయంలో చురుకుగా వ్యవహరించడం, తోటి వారితో సహకారం, డిజిటల్‌ సామర్ధ్యం ముఖ్యమని మరో నిపుణుడు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -