నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఐదు శాతం రిజర్వేషన్‌ను తొలగించింది. ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ జాబ్స్‌లో ముస్లిం కమ్యూనిటీకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని పదేళ్ల క్రితం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. జూలై 2014లో ప్రవేశపెట్టిన ఈ ఆర్డినెన్స్‌పై ముంబై హైకోర్టులో సవాల్ చేయగా..నవంబర్ 14, 2014లో హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీంతో డిసెంబర్ 23, 2014నాటికి చట్టంగా అమలు చేయకపోవడంతో ఈ ఆర్డినెన్స్ గడువు ముగిసింది. తరువాత సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి)ను నిర్ణయిస్తూ రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే గత పదేళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ప్రకటించలేదు. తాజాగా అధికారంలో ఉన్న ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది.
ఈ రిజర్వేషన్లను రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఎస్‌ఎల్‌పి ఆర్దర్ ద్వారా సుప్రీంకోర్టు ఆ ఆర్డర్‌ను రద్దు చేయడం. రెండు.. కోర్టు ఆదేశాలననుసరించి చట్టంగా మార్చడానికి బిల్లుగా మహారాష్ట్ర శాసనసభ ముందుకు రాకపోవడం. ఈ రెండు కారణాల వల్లే దశాబ్దకాలంగా అమలులో లేని రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సామాజిక న్యాయ శాఖ ప్రకటించింది.



