ప్రతి ఐదుగురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు
పది శాతం మందిపై తీవ్రమైన నేరాలు
981 మంది అభ్యర్థులు కోటీశ్వరులు.. ఏడు శాతం పెరుగుదల
బరిలో నిలిచిన మహిళల సంఖ్య 11 శాతమే..ఏడీఆర్ నివేదిక
చెన్నై : ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్), తమిళనాడు ఎలక్షన్ వాచ్ (టీఎన్ఈడబ్ల్యూ) విశ్లేషణ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల్లో నాలుగో వంతు మంది కోటీశ్వరులు ఉన్నారు. చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో టీఎన్ఈడబ్ల్యూ రాష్ట్ర సమన్వయకర్త పి.జోసెఫ్ విక్టర్ రాజ్, అరప్పోర్ అయ్యక్కం సభ్యుడు వి.జయరాం అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.
18 శాతం మందిపై క్రిమినల్ కేసులు
ఏడీఆర్ మొత్తం 4,023 మంది అభ్యర్థుల్లో 3992 మంది సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిం చింది. వీరిలో 722 మంది (18 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. 2021లో ఈ సంఖ్య 13 శాతంగానే ఉంది. ఈ సారి అది ఐదు శాతం పెరగడం గమనార్హం. ఇక 404 మంది (పది శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంఖ్య ఆరు శాతమే కాగా.. అది ఇప్పుడు నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేయడం ఆందోళనకరమైన విషయం.
కోటీశ్వరులు 981 మంది..
డీఎంకే నుంచి అధికంగా 170 మంది
మొత్తం 981 మంది అభ్యర్థులు కోటీశ్వరులు గా ఉన్నారు. 2021తో పోలిస్తే ఏడు శాతం పెరుగుదల నమోదైంది. అధికార డీఎంకే పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో 170 మంది కోటీశ్వ రులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ప్రధాన ప్రతి పక్షం ఏఐఏడీఎంకే నుంచి 160 మంది, ప్రముఖ తమిళ సినీ నటుడు విజరు స్థాపించిన కొత్త పార్టీ టీవీకే నుంచి 156 మంది ఉన్నారు. ఇక బీజేపీ (31 మంది), కాంగ్రెస్ (27 మంది), పీఎంకే (16 మంది), డీఎండీకే (10 మంది)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అభ్యర్థుల మొత్తం ఆస్తులు
విలువ రూ.20వేల కోట్ల పైనే..!
ఎన్నికల బరిలో ఉన్న 3992 మంది అభ్యర్థుల మొత్తం ఆస్తుల విలువ రూ.20,678 కోట్లుగా ఉన్న ది. సంపన్న అభ్యర్థులుగా లీమార్సె మార్టిన్, టీవీకే అధినేత, సినీనటుడు సి జోసెఫ్ విజరు, ఆధవ్ అర్జునలు నిలిచారు. మరో వైపు విలవాం కోడ్‌కు చెందిన ఎం. మోహన్ కుమార్, కులితలైకి చెందిన టి.సెల్వరాజ్, కోవిల్పట్టికి చెందిన పి. గుణశేఖరన్, లాల్గుడికి చెందిన ఎ.జెగన్ సలమొండోస్ అనే నలుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించటం గమనార్హం.
46 శాతం మంది ఉన్నత విద్యావంతులు
విద్యార్హతల విషయానికొస్తే… 1711 మంది (43 శాతం) ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివారు. 1822 మంది (46 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పైచదువులు పూర్తి చేశారు. 301 మంది డిప్లొమా కలిగి ఉండగా.. 95 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. 56 మంది కేవలం అక్షరాస్యులు. ఏడుగురు తమ విద్యా వివరాలు వెల్లడించలేదు.
వయస్సుపరంగా…
వయస్సు ప్రకారం 1424 మంది (36 శాతం) 25-40 ఏండ్ల మధ్య ఉన్నారు. 2034 మంది (51 శాతం) 41-60 ఏండ్ల మధ్య ఉన్నారు. 526 మంది (13 శాతం) 61-80 ఏండ్ల మధ్య ఉండగా.. 80 ఏండ్లు దాటినవారు ఎనిమిది మంది ఉన్నారు.
మహిళల ప్రాతినిధ్యంలో
కనిపించని మార్పు
ఇక మహిళల ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈ సారి ఎన్నికల్లో 442 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్య 378గా ఉంది. అయితే బరిలో నిలిచిన మహిళల శాతంలో ఎలాంటి మార్పూ లేదు. గత ఎన్నికల్లోనూ, ఈ సారి జరగబోయే ఎన్నికల్లోనూ 11 శాతం మంది మహిళలు పోటీలో నిలిచారు.



